Aug 07,2021 16:02

విజయవాడ : పులిచింతల ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ(మార్క్సిస్టు) డిమాండ్ చేసింది. ఈ మేరకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు పత్రికా ప్రకటనను విడుదల చేశారు. కృష్ణానదిపై పులిచింతల ప్రాజెక్టు గేటు కొట్టుకుపోవడం ఆందోళనకు గురి చేస్తున్నదని పేర్కొన్నారు. ఇది గేటు అమరికలో పొరపాటు కారణమా? లేక మొత్తం డ్యామ్‌ నిర్మాణమే తక్కువ నాణ్యతతో కట్టబడిందా? వంటి సందేహాలతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. కృష్ణా డెల్టా స్థిరీకరణ కోసం, విద్యుత్‌ ఉత్పత్తి కోసం ఉద్దేశించబడిన ఈ ప్రాజెక్టు నిర్మాణం సందర్భంలోనే పలు అవకతవకలు జరిగినట్టు గతంలోనే ఫిర్యాదులు వచ్చాయని పేర్కొన్నారు. ఇప్పుడు గేటు వూడిపోవడంతో డ్యామ్‌ నాణ్యతపై పలు అనుమానాలకు ఆస్కారం ఏర్పడిందని తెలిపారు. ఖరీఫ్‌ సీజన్‌లో వ్యవసాయానికి ఉపయోగపడాల్సిన విలువైన నీరు సముద్రంలో కలిసిపోతున్నదని తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నిపుణులతో సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన అధికారులు, కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు. అలాగే డ్యాము భద్రతకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని పి మధు కోరారు.