May 15,2023 00:05

వివరాలు వెల్లడిస్తున్న పోలీసులు. వెనక ముసుగుల్లో పట్టుబడిన నిందితుల్లో కొందరు..

ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : తాడికొండ మండలం పొన్నెకల్లు, చిలకలూరిపేట పండరీపురంలో ఇద్దరు యువతులపై లైంగిక దాడి కేసులో పోలీసులు 12 మందిని అరెస్టు చేశారు. ఈ మేరకు వివరాలను నల్లపాడు రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో దక్షిణ మండలం డిఎస్‌పి ఎమ్‌డి.మహబూబ్‌బాష ఆదివారం వెల్లడించారు. దిశ యాప్‌ ద్వారా యువతులు ఇచ్చిన సమాచారం మేరకు నిందితుల నుంచి రక్షించి వారి ప్రాణాలను కాపాడమని ఆయన తెలిపారు. పూజల పేరుతో అధిక మొత్తంలో డబ్బు సంపాదించవచ్చని భ్రమపెట్టి యువతులను ట్రాప్‌ చేశారని, వారిపై లైంగిక దాడి చేయగా ఈ కేసును తాము 24 గంటల్లో చేధించి నిందితులను పట్టుకున్నామని తెలిపారు. ఇంకా కొంతమంది నిందితులున్నారని, వీరిపైనా దర్యాప్తుచేసి త్వరలో అరెస్టు చేస్తామని చెప్పారు.
తాడికొండ మండలముమ పొన్నెకల్లుకు చెందిన టాపీ మేస్త్రీ నాగేశ్వరరావు కొంత కాలంగా తాంత్రిక పూజలు చేస్తూ ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. బృంద సభ్యులైన అరవింద, రాధ, నాగేంద్రబాబు, భాస్కర్‌, వెంకట సురేష్‌, రవి మరికొంతమంది కలసి అమాయకులైన పేద యువతులను, మాయ మాటలు చెపి, మోసం చేసి, వారు ఒక గంట పూజలో కూర్చుంటే రూ.లక్షల్లో డబ్బులు ఇస్తాము అని ఆశ జూపి, ఇద్దరు యువతులను లోబర్చుకున్నారు. వారిని తొలుత పొన్నెకల్లు, తరువాత చిలకలూరిపేటలో పూజల్లో నగంగా కూర్చొబెట్టి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ యువతులు పారిపోవడానికి ప్రయత్నించగా నిందితులందరూ, వారిని భయపెట్టి కదలనియకుండా అక్కడే కూర్చోబెట్టి, డబ్బులు కావాలంటే తాము చెప్పినట్లు చేయవలసిందే లేదంటే రూపాయి కూడా ఇచ్చేదిలేదని బెదిరించడంతోపాటు తీవ్ర పదాలతో దుర్భాషలాడారు.
ఇద్దరు యువతులను చిలకలూరిపేట నుంచి పొన్నెకల్లుకు బలవంతంగా తీసుకు వెళుతున్న క్రమంలో వారు గోరంట్ల వద్ద దగ్గర అగిన సందర్భంలో ఒక యువతి దిశ కాల్‌ 112కు ఫోన్‌ చేయడతో నల్లపాడు పోలీసులు అక్కడకు వెళ్లి యువతులిద్దర్నీ కాపాడారు. యువతులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పూజారి నాగేశ్వరరావు, అరవింద, రాధా, నాగేంద్ర బాబు, భాస్కర్‌, పెద్దిరెడ్డి, సాగర్‌, వెంకట సురేష్‌, శివ, సునీల్‌, పవన్‌, సుబ్బు అనే వ్యక్తులను ఆదివారం అరెస్టు చేశామని, వీరిని కోర్టులో హాజరుపరుస్తామని డిఎస్‌పి తెలిపారు. సిఐ బత్తుల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.