నిశ్శబ్దం ఆవహించి
నిస్సహాయత పులుముకున్న దేహానికి
ప్రాణం కొడగట్టిన దీపమై
తనివితీరా నిద్రపోవాలని అనిపిస్తుంది !
పద్మవ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుడిలా
సమస్యల సుడిగుండంలో
దిక్కుతోచని ఒంటరిగా మారి
మృత్యుకౌగిలి మాత్రమే ఓదార్పు మంత్రమని
మనసును మాయ చేస్తుంది!
బాధ్యతలు గుదిబండలా భావిస్తూ
కష్టాల కడలి ముంచేసినట్టు
భ్రమలో మునిగిన మనసును
చీకటి ముసుగు కమ్మేస్తుంది!
దొంగలా అజ్ఞాతంలో దాగలేక
దొరలా బతికే ధైర్యం లేక
నేలతల్లి మోస్తున్నదన్న ఆశ
తొందరపాటుతో తీసుకున్న తుదిశ్వాస!
నేటితో ఈ కథ అయితే కంచికి చేరిన
దేహం మట్టిలో కలిసినా
ఆత్మ రోజూ నలిగిపోతూనే ఉంటుంది!
తన వారి బాధను చూస్తూ
చేసిన తప్పుని తలుచుకుంటూ
విడిచిన దేహాన్ని పొందలేక
గతాన్ని మార్చలేక...
పశ్చాత్తాపంతో చావలేక బతకలేక
శాశ్వత శెలవు కోసం
ఎదురుచూస్తూ రోదిస్తుంది !
జ్యోతి మువ్వల
90080 83344