Mar 29,2023 00:24

పూడిక తీత పనులను పరిశీలిస్తున్న ఎంపిపి రాంబాబు తదితరులు

ప్రజాశక్తి-పద్మనాభం : మండల పరిషత్‌ నిధులు రూ.3లక్షలతో సుమారు 3 కిలో మీటర్లు పరిధిలో ఉన్న పెద్ద కాలువలో పూడికతీత పనులు మూడు రోజులుగా ముమ్మరంగా చేస్తున్నారు. ఈ పనులను ఎంపిపి కె.రాంబాబు మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సుమారు 15 సంవత్సరాల నుంచి కాలువలో పూడికతీత పనులు చేపట్టకపోవడంతో నీరు అందక సాగు రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కాలువలో పూడిక తీత పనులు లేక నీరు సరిగా రావడంలేదని స్థానిక రైతులు విలాస్‌ఖాన్‌పాలెం గ్రామానికి చెందిన ఎంపిటిసి బోని సావిత్రి, సర్పంచ్‌ నల్లి సత్యవతి దృష్టికి తీసుకువెళ్లారు. ఇటీవల జరిగిన మండల బడ్జెట్‌ సమావేశాల్లో ఈ విషయాన్ని ఎంపిపి రాంబాబు దృష్టికి సావిత్రి, సత్యవతి తీసుకెళ్లారు. స్పందించిన ఎంపిపి వెంటనే నిధులు మంజూరు చేశారు. దీంతో పూడికతీత పనులు చేపట్టారు. కాలువను తవ్వడంతో నీరు ఎక్కడా నిల్వ ఉండకుండా మద్ది గ్రామానికి చెందిన రాజు వెంకటపతిరాజు చెరువుకు చేరుకుంటుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పద్మనాభరాజు చెరువు నుంచి వచ్చిన కాలువ సరిగ్గా లేక పోవడం వల్ల నీరు పొలాలకు చేరక పంటలు పండేవి కాదని రైతులు వివరించారు. ఇంకా మూడు కాలువలు పూడికలతో నిండి ఉన్నాయని, వాటికి కూడా నిధులు కేటాయించి పూడికలు తీయాలని రైతులు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బి.సన్యాసినాయడు, నల్లి సన్యాసప్పడు, బి.అప్పలనాయడు, కె.రామకృష్ణ, రైతులు బోని రామకృష్ణ, జి.శ్రీను, ఆర్‌.ముత్యాలప్పడు తదితరులు పాల్గొన్నారు.