Nov 16,2023 21:49

పార్వతీపురం : విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతున్న గ్రంథాలయ సంఘం జిల్లా అధ్యక్షులు

ప్రజాశక్తి - పార్వతీపురం టౌన్‌ : విద్యార్థులు పుస్తక పఠనంపై ఆసక్తి పెంచుకొని గ్రంథాలయాలు ఆలంబనగా అభివృద్ధి చెందాలని ఎపి గ్రంథాలయ సంఘం జిల్లా అధ్యక్షులు టి.శివ కేశవరావు అన్నారు. గురువారం స్థానిక ప్రభుత్వ జూనియర్‌కాలేజీలో ప్రిన్సిపల్‌ జె.రామారావు అధ్యక్షతన జరిగిన గ్రంథాలయ వారోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ గ్రంథాలయాలు విజ్ఞానజ్యోతులని, వాటిని ఉపయోగించుకొని విద్యార్థులు ఉన్నత స్థితికి చేరుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో పాల్గొన్న వారికి బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో అధ్యాపకులు తెర్లి రవి కుమార్‌, రవి, తదితరులు పాల్గొన్నారు.
పట్టణ గ్రంథాలయంలో...
జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు సందర్భంగా గురువారం పట్టణంలోని శాఖా గ్రంథాలయంలో గ్రంథాలయాధికారి ధర్మారావు ఆధ్వర్యంలో గ్రంథాలయ ఉద్యమంలో పాల్గొన్న ప్రముఖులు డాక్టర్‌ ఎస్సార్‌ రంగనాథన్‌, పాతూరి నాగభూషణం, అయ్యంకి వెంకటరమణయ్య తదితరులను స్మరించుకుంటూ వారి చిత్ర పటాలకు పలువురు పాఠకులు నివాళులు అర్పించారు.
సీతానగరం: గ్రంథాలయాల వారోత్సవాలను పురస్కరించుకొని స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఇ.ప్రసన్నలక్ష్మి, ఉపాధ్యాయులు శ్రీనివాసరావు, నాగరాజు, వెంకట్రావు, గ్రంథాలయాధికారి టి వెంకటరావు విద్యార్థులు పాల్గొన్నారు.
వీరఘట్టం :స్థానిక శాఖా గ్రంథాలయంలో గురువారం విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు నిర్వహించినట్లు గ్రంథాలయ అధికారి ఎం.వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా మహర్షి మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలకు చెందిన 50 మంది ఐదో తరగతి విద్యార్థులు చిత్రలేఖన పోటీలో పాల్గొన్నట్లు ఆయన తెలిపారు. అనంతరం గ్రంథాలయ ఉద్యమకారులు ఎస్సార్‌ రంగనాథ్‌, పాతూరి నాగభూషణం, అద్దంకి వెంకట రమణయ్య చిత్రపటాలకు పూలమాలవేసి నివాళ్లు అర్పించారు. కార్యక్రమంలో ఆయా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు వి.అన్నాజీరావు, బి విజయలక్ష్మి, ఎం.రామకృష్ణ, ప్రసాదు తదితరులు పాల్గొన్నారు.
గరుగుబిల్లి: విద్యార్థులు గ్రంథాలయాలను సద్విని యోగం చేసుకోవాలని హిక్కిం వలస మండల పరిషత్తు ప్రాథమిక ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొట్నాన మురళీమోహన్‌ అన్నారు. స్థానిక శాఖా గ్రంథాలయంలో గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా గురువారం గ్రంథాలయ ఉద్యమ నాయకుల చిత్రపటాలకు పూల మాలలువేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో స్థానిక శాఖా గ్రంథాలయం నిర్వాహకులు నల్ల మధుసూదనరావు, పాఠకులు పాల్గొన్నారు.
పాచిపెంట: స్థానిక శాఖా గ్రంథాలయంలో జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా గ్రంథాలయ ఉద్యమంలో పాల్గొన్న ఎంఆర్‌ రంగనాధ్‌, పాతూరి నాగభూషణం, అయ్యంకి వెంకటరమణయ్య తదితరులను స్మరించారు. స్థానిక సమతా స్కూల్‌ ఉపాధ్యాయులు శ్రీరాం మూర్తి, విశ్రాంత ఉపాధ్యాయులు మన్మధరావు కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో విద్యార్థులు, పాఠకులు పాల్గొన్నారు.
పాలకొండ: స్వాతంత్రోద్యమ సమయంలో గ్రంథాలయాలు కీలకపాత్ర పోషించాయని ఉత్తరాంధ్ర జిల్లా ఎంప్లాయిస్‌ ఐక్యవేదిక కన్వీనరు నూతలపాటి భరత్‌భూషణ్‌ అన్నారు. గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా గ్రంథాలయోద్యమ నాయకులు అయ్యంకి వెంకటరమణయ్య, ఎస్‌ఆర్‌ రంగనాధన్‌ చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. కార్యక్రమంలో పాఠకులు, అడ్మిన్‌ శివకృష్ణ, అరవింద్‌, ఇన్‌ఛార్జి గ్రంథాలయ అధికారి బబ్బురు గణేష్‌ బాబు సహాయకుడు ఈశ్వర్‌ పాల్గొన్నారు.
సీతంపేట : జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా గ్రంథాలయ ఉద్యమ నాయకులు అయ్యంకి వెంకట రమణయ్య, ఎస్‌ఆర్‌ రంగనాధన్‌ చిత్రపటాలకు విశ్రాంత గ్రంథాలయ అధికారి శ్రీరాములు పూల మాల వేసి నివాళుర్పించారు. కార్యక్రమంలో పాఠకులు, గ్రంథాలయ అధికారి బబ్బురు గణేష్‌ బాబు, సహాయకులు రామకృష్ణ పాల్గొన్నారు.