Aug 09,2023 00:35

రికార్డులు పరిశీలిస్తున్న కాంతారావు

ప్రజాశక్తి-పాడేరు:కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పధకాలను తప్పు తోవ పట్టించినా, సక్రమంగా అమలు చేయకపోయినా భాధ్యులపై చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఆహార కమిషన్‌ సభ్యులు బి.కాంతారావు హెచ్చరించారు. మంగళవారం జిల్లా పర్యటనలో భాగంగా పాడేరు మండలంలో పలు ప్రాంతాలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన సభ్యులు మాట్లాడుతూ, పిల్లల జ్ఞాపక శక్తి పెంపొందించడానికి ఫోర్టిఫైడ్‌ బియ్యం సరఫరా చేస్తున్నట్లు గుర్తు చేసారు. ఎండియు వాహనంలో స్టాక్‌లో అవకతవకలు ఉన్నట్లు గుర్తించిన సభ్యులు ఆపరేటర్‌కు మెమో జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. గుడివాడ2 అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించిన సభ్యులు స్టాక్‌ వివరాలు వెల్లడించడంలో లోపాలను గుర్తించి సంబంధిత టీచర్‌కు మెమో జారీ చేయాలని ఆదేశించారు. సుండ్రుపుట్టు అంగన్వాడీ కేంద్రంలో పిల్లల హాజరు పట్టిలో కొట్టివేతలు, దిద్దుబాట్లు ఉండడంతో సదరు టీచర్‌ కు కూడా మెమో జారీ చేయాలని ఆదేశించారు. పాడేరు ప్రభుత్వ హైస్కూల్‌లో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు.ఈ కార్యక్రమంలో జిల్లా సరఫరా అధికారి పి.వి. శ్యాం కుమార్‌, గిరిజన సంక్షేమ ఉప సంచాలకులు కొండలరావు, ఎటిడబ్ల్యుఒ రజని, ఐసిడిఎస్‌ పిడి ఎన్‌.సూర్యలక్ష్మి, సిడిపిఒ ఝాన్సి పాల్గొన్నారు.