ప్రజాశక్తి-బాపట్ల జిల్లా: రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని గుంటూరు జిల్లా పరిషత్ చైర్మన్ హెన్రీ క్రిస్టినా పిలుపునిచ్చారు. బుధవారం బాపట్ల కలెక్టరేట్‌లో వైఎస్‌ఆర్‌ఇబిసి నేస్తం ముఖ్యమంత్రి వర్చువల్ లాంచింగ్ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్మన్ మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీలను 99 శాతం అమలు చేశారన్నారు. రాష్ట్రంలో కుల మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్నారన్నారు. పాదయాత్ర సమయంలో పేదల కష్టాలు చూసిన ముఖ్యమంత్రి అగ్రవర్ణాల పేదల కోసం వైఎస్‌ఆర్ ఇబిసి నేస్తం కార్యక్రమం ద్వారా పేద ప్రజలను ఆదుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో పేద ప్రజలకు గృహాలను నిర్మించడానికి పెద్దఎత్తున చర్యలు తీసుకున్నారన్నారు. ముఖ్యమంత్రి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వినియోగించుకుని అభివృద్ధి చెందాలన్నారు. రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని కోరారు. బాపట్ల జిల్లాలో వైఎస్‌ఆర్ ఇబిసి నేస్తం కింద 26 వేల 221 మందికి రూ.39.28 కోట్లను బటన్ నొక్కి ముఖ్యమంత్రి లబ్ధిదారుల ఖతాలకు జమ చేస్తారని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్మన్ వైఎస్‌ఆర్ ఇబిసి నేస్తం మెగా చెక్కును లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సహకార మార్కెటింగ్ సలహాదారులు బత్తుల బ్రహ్మనందరెడ్డి, రాష్ట్ర అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ ఏడుకొండలు, రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ గోలికుమారి, జిల్లా రెవెన్యూ అధికారి లక్ష్మీశివజ్యోతి, మున్సిపల్ కమిషనర్ భాను ప్రతాప్, బిసి కార్పొరేషన్ పరిపాలనా అధికారి నరసింహమూర్తి, మహిళలు పాల్గొన్నారు.










