
ప్రజాశక్తి-నర్సీపట్నంటౌన్: ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అనకాపల్లి జిల్లా కలెక్టర్ రవి పఠాన్ శెట్టి కోరారు. బుధవారం నర్సీపట్నంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్థానిక పద్మావతి ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన ఈబీసీ నేస్తం రెండవ విడత ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రెండవ విడత ఏబీసీ నేస్తం చెక్కు పంపిణీ కార్యక్రమాన్ని లబ్ధిదారులు తిలకించేందుకు వీలుగా ఫంక్షన్ హాల్లో ప్రత్యేక స్క్రీన్ ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి ప్రసంగాన్ని జిల్లా కలెక్టర్ స్క్రీన్ పై వీక్షించారు. అనంతరం జిల్లావ్యాప్తంగా ఉన్న 4864 మంది ఈ బీసీ నేస్తం లబ్ధిదారులకు రూ.7 కోట్ల 29 లక్షల 60 వేల చెక్కును ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా బీసీ కార్పొరేషన్ అనకాపల్లి జిల్లా ఇంచార్జ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జి.పెంటోజీరావు మాట్లాడుతూ, 2021-22 కు సంబంధించి మొదటి విడత ఈబీసీ నేస్తంలో 3077 మంది లబ్ధిదారులకు రూ.4కోట్ల,61లక్షల 85 వేలు అందజేశారని, 2022-23కు సంబంధించి జిల్లా వ్యాప్తంగా ఈబీసీ నేస్తం లబ్ధిదారులు 4864మంది ఉన్నారని, వీరందరికీ రెండవ విడతగా రూ.7కోట్ల, 29లక్షల 60 వేలు విడుదల చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ కే రాజేశ్వరి, రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ కోలా గురువులు, నర్సీపట్నం ఆర్డీవో హెచ్‌వి జయరాం, ఎంపీపీ సుర్ల రాజేశ్వరి, ఎంపీడీవో జయ మాధవి, ఇన్చార్జి తహసిల్దార్ అన్నాజీరావు, మున్సిపల్ కమిషనర్ కనకారావు, భారీ ఎత్తున లబ్ధిదారులు పాల్గొన్నారు.