ప్రజాశక్తి-నక్కపల్లి:రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడంలో సచివాలయ కన్వీనర్లు, గృహ సారధులు కీలక పాత్ర పోషించాలని ఎమ్మెల్యే గొల్ల బాబురావు పిలుపుచిచ్చారు. నక్కపల్లిలో వైసీపీ నాయకులు శీరం నరసింహమూర్తి కొబ్బరి తోటలో ఆదివారం మండలానికి సంబంధించిన సచివాలయ కన్వీనర్లు, గృహ సారుదులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాబురావు మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మునుపెన్నడూ లేని విధంగా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల ద్వారా ప్రజలు ముంగిటకు చేరవేయడం జరుగుతుందన్నారు.పాయకరావుపేట నియోజకవర్గంలో తాను అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. డిగ్రీ కళాశాల, 50 పడకల ఆసుపత్రి, రోడ్లు వంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్టు చెప్పారు. పాలిటెక్నిక్ కాలేజి ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నా, లేకపోయినా పాయకరావుపేట ప్రజలకు అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు. కన్వీనర్లకు, గృహసారథులకు స్టిక్కర్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు శీరం నరసింహమూర్తి, బొల్లం బాబ్జి, చందర్రావు, సూరకాసులు గోవింద్, గొర్ల నరసింహమూర్తి, ఎలమంచిలి తాతబాబు, శేషారత్నం, బాబురావు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.










