Oct 05,2023 23:18

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విధానాలు రైతుల పాలిట శాపంగా మారుతున్నాయి. వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత పంటలు సాగు చేసే ప్రతి ఒక్క రైతు ఈక్రాప్‌ బుకింగ్‌, ఇకెవైసి తప్పనిసరిగా చేసుకోవాల్సిందేననే నిబంధన విధించడంతో అనేక మంది రైతులు ప్రభుత్వ పథకాలకు దూరమవుతున్నారు. సర్కారు తప్పులు, అధికారుల నిర్లక్ష్యంతో వేల మంది నష్టపోతున్నారు. ప్రస్తుతం ఈ ఖరీఫ్‌ సీజన్లో ఇకెవైసి పూర్తికాని రైతులు వేలల్లో ఉన్నారు. గడువు సమీపిస్తున్న వేళ పధకాలను కోల్పోతామన్న ఆందోళన అందరిలోనూ కనిపిస్తుంది. పంటల బీమా, పంట నష్ట పరిహారం, పంట గిట్టుబాటు ధర, రైతు భరోసా, సున్నా వడ్డీ ఇలా ఏ పథకాలు కావాలన్నా రైతులు తప్పనిసరిగా ఈ-పంటలో నమోదు చేసుకోవడంతో బాటు ఇకెవైసి కూడా తప్పనిసరిగా నమోదు అవ్వాలి. జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో సుమారు 2.30 లక్షల ఎకరాల్లో వరి సాగు జరుగుతెంది. పత్తి 10,237 ఎకరాలు, చెరకు 9,387 ఎకరాలు, మినుములు 2,811, మొక్కజొన్న 595, కందుల 382, నువ్వులు 230, వేరుశెనగ 17 ఎకరాల్లో సాగవుతుందని అధికారులు చెబుతున్నారు.
73 శాతమే ఇకెవైసి పూర్తి
జిల్లాలో 45 రోజులుగా ఇకెవైసి నమోదు ప్రక్రియ జరుగుతుండగా సాంకేతిక కారణాలతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నెల 5తో గడువు ముగిసిందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. జిల్లాలో 21 మండలాల్లో 2.97 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవగా 1,73965 మంది రైతులకు చెందిన 2,55,639 ఎకరాలకు ఈక్రాప్‌ నమోదు చేశారు. వీటిలో 1,074,73 మంది రైతులకు చెందిన 2,08,246 ఎకరాలకు మాత్రమే ఇకెవైసి పూర్తి అయింది. కేవలం 73 శాతమే పూర్తి అయింది. గొల్లప్రోలు మండలంలో 49.50 శాతం, తొండంగి మండలంలో 60 శాతం, సామర్లకోట మండలంలో 64.17 శాతం, రౌతులపూడిలో 68.75 శాతం, కరప 68.85, పిఠాపురం 70.46, కోటనందూరు 71.52, శంఖవరం 72.09, కిర్లంపూడి 72.46, ఏలేశ్వరం 72.67, ప్రత్తిపాడు 73.99 శాతం నమోదయింది.
గురువారంతో గడువు ముగిసినందున నమోదు ప్రక్రియ పూర్తయ్యనా అనే అనుమానాలు అందరిలోనూ వ్యక్తమవుతున్నాయి. రైతులు ఇప్పటికే ఇకెవైసి నమోదు కోసం ఈ క్రాప్‌ బుకింగ్‌ చేసుకుని ఆయా రైతు భరోసా కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అయితే సర్వర్‌ సమస్య వల్ల సాంకేతిక ఇబ్బందులు తలెత్తుతున్నాయని సిబ్బంది చెబుతున్నారు. దీంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు రైతులు ఆర్‌బికెల వద్ద పడిగాపులు కాస్తున్నారు. పథకాలకు ఎక్కడ దూరమయిపోతామని ఆందోళనతో వ్యవసాయ పనులను మానుకొని గడుపుతున్నారు. ప్రభుత్వం గడవ పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.