ప్రజాశక్తి - మంత్రాలయం
అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలకు అర్హులను గుర్తించాలని ఎంపిడిఒ మణిమంజరి అధికారులకు నిశ నిర్దేశం చేశారు. శుక్రవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో 'జగనన్న సురక్ష'పై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి టివిలో లైవ్ ద్వారా ఇచ్చిన సూచనలు వినిపించారు. అనంతరం ఆమె మాట్లాడారు. 'జగనన్న సురక్ష' ద్వారా మండల స్థాయి అధికారులతో కలిసి సచివాలయ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, వాలంటీర్లు, గృహసారథులు ఈ నెల 24 నుంచి ప్రతి ఇంటికీ వెళ్లాలని తెలిపారు. సంక్షేమ పథకాలకు రాజకీయాలకు, కులమతాలకు, వివక్ష చూపకుండా అర్హులను గుర్తించాలని, ఏ సంక్షేమ పథకాలు పొందారో వివరించాలని చెప్పారు. అనర్హులుగా ఎందుకు గుర్తించారో గుర్తించి దరఖాస్తుదారులకు తెలిపి సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు ఉండాలని సూచించారు. సమస్య ఏ శాఖ అధికారి పరిధిలో ఉందో గుర్తించి పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. జనన, మరణ, వివాహ, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి వెంటనే మంజూరు చేయాలని కోరారు. తహశీల్దార్ చంద్రశేఖర్, మండల ఉపాధ్యక్షులు పులికుక్క రాఘవేంద్ర, సర్పంచి తెల్లబండ్ల భీమయ్య, ఎంపిటిసి వెంకటేష్ శెట్టి పాల్గొన్నారు.
సమావేశంలో మాట్లాడుతున్నఎంపిడిఒ










