ప్రజాశక్తి - చిలకలూరిపేట : భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాల అమలకు అడ్డంకిగా ఉన్న మెమో 1214ను వెంటనే రద్దు చేయాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజిని వద్దకు భవన నిర్మాణ కార్మికులు మంగళవారం సామూహిక రాయబారం నిర్వహించారు. భవన నిర్మాణ ఇతర కార్మిక సంఘం (సిఐటియు) ఆధ్వర్యంలో స్థానిక కళామందిర్ సెంటర్‌లోని నిర్మాణ కార్మికుల అడ్డా నుంచి భారీ ర్యాలీగా చౌత్ర సెంటర్ మీదుగా ఎన్‌ఆర్‌టి సెంటర్లోని మంత్రి కార్యాలయానికి వెళ్లారు. అనంతరం కార్యాలయంలోని విడుదల గోపికి వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.ఆంజనేయులు నాయక్ మాట్లాడుతూ 2019 వరకు భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు అమల య్యాయని, నాలుగున్నరేళ్లుగా అమలు కావడం లేదని చెప్పారు. పల్నాడు జిల్లాలో 2248 క్లెయిమ్‌లకు సంబంధించి రూ.6 కోట్లు కార్మికులకు రావాల్సి ఉందని, వీటిని వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి సిలార్ మసూద్ మాట్లా డుతూ గతంలో కార్మికులు ప్రమాదం వశాత్తు మరణిస్తే రూ.5 లక్షలు ఇచ్చే వారని, ప్రస్తుతం దానిని 10 లక్షలుగా ఇవ్వాలని, సంక్షేమ బోర్డును కాపాడాలని, క్రొత్త కార్డులు నెలలో ఇవ్వాలని, 60 ఏళ్లు దాటిన వారికి రూ.6 వేల పెన్షన్ ఇవ్వాలని కోరారు. పెళ్లి కానుకను చదువును ముడి పెట్టటం వల్ల చాలా మంది లబ్ధి పొందలేక పోతున్నారని అన్నారు. కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎ.ప్రసాదరావు, నాయకులు ఆంజనేయులు, కె.సురేష్, ఆర్.ఆంజనే యులు, బి.కొండలు సిఐటియు మండల కార్యదర్శి పి.వెంకటేశ్వర్లు, వెంకట్రావు, ఎం.విల్సన్, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఎం.రాధాకృష్ణ, విసికె పార్టీ అధ్యక్షులు ముత్తయ్య, వివిధ సంఘాల నాయకులు ఎ.మోహన్, కారుచోల రోశయ్య, కాకాని రోశయ్య, ఎస్.బాబు, బి.బాలకోటయ్య, కార్మికులు పాల్గొన్నారు.










