Jun 26,2023 00:57

సమావేశంలో మాట్లాడుతున్న కెఎస్‌ఎస్‌ ప్రసాద్‌, వేదికపై ఇతర నాయకులు

ప్రజాశక్తి - పల్నాడు జిల్లా కరస్పాండెంట్‌ : నాడు-నేడు పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌ పాఠశాలలుగా తీర్చిదిద్దామని, విద్యార్థుల సౌకర్యం కోసం సకల సౌకర్యాలు ఏర్పాటు చేశామని చెబుతున్న ప్రభుత్వం ఉపాధ్యాయుల కొరతను అధిగమించడంలో విఫలమైందని యుటిఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెఎస్‌ఎస్‌ ప్రసాద్‌ అన్నారు. స్థానిక పల్నాడు రోడ్డులోని మున్సిపల్‌ బాలుర పాఠశాలలో ఆదివారం యుటిఎఫ్‌ జిల్లా కార్యవర్గ సమావేశానికి యుటిఎఫ్‌ పల్నాడు జిల్లా అధ్యక్షులు పి.ప్రేమ్‌కుమార్‌ అధ్యక్షత వహించారు. కెఎస్‌ఎస్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ పేద విద్యార్థుల భవిష్యత్‌కు బంగారు బాటలు వేయాలంటే ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలన్నారు. అమ్మఒడి, జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద వంటి పథకాలున్నా ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఏడాది ప్రవేశాలు ఆశాజనకంగా లేవని, ప్రైవేట్‌ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు గణనీయంగా పెరిగాయని తెలిపారు దీనికి కారణం ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరతతో తమ పిల్లలకు నాణ్యమైన విద్య అందదని తల్లిదండ్రులు భావించడమేనన్నారు. ఆకర్షణీయమైన పథకాలతో పాటు పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు నియమించి కొరత లేకుండా చూసినప్పుడే ప్రభుత్వ విద్యా రంగం బలపడుతుందన్నారు. జీవో 117 పేరిట ప్రభుత్వ పాఠశాలల విలీనం చేయడం వలన విద్యార్థులకు పాఠశాలల దూరమై కొందరు పేద విద్యార్థులు బడికి దూరం అవుతున్నారన్నారు. ప్రభుత్వ విద్యా రంగ పరిరక్షణ కోసం ఉపాధ్యాయులతో పాటు మేధావి వర్గం కూడా కషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రమోషన్లు ఇస్తూ సెకండరీ గ్రేడ్‌ ఉపాధ్యాయుల పోస్టులు రద్దు చేయడం ఏ మాత్రం హర్షణీయం కాదని చెప్పారు. ప్రేమ్‌కుమార్‌ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న అనేక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు ఖాళీలు ఏర్పడ్డాయని, వాటిని భర్తీ చేయాలని కోరారు. బదిలీ కాబడి రిలీవర్‌ లేక రిలీవ్‌ కాని వారిని వెంటనే రిలీవ్‌ చేయాలని చెప్పారు. యుటిఎఫ్‌ జిల్లా కార్యదర్శి జి.విజయసారథి మాట్లాడుతూ బదిలీల ద్వారా ఉత్పన్నమైన అనేక సమస్యలను తక్షణమే పరిష్కరించాలన్నారు. అధికారులు తప్పిదాల వల్ల ఉపాధ్యాయులు నష్టపోవడం బాధాకరమన్నారు. అప్‌ గ్రేడ్‌ అయిన ఉన్నత పాఠశాలలకు డిడిఒ కోడ్‌లు ఇచ్చి ఈ నెలలో వేతనాల సమస్యలు రాకుండా చూడాలని కోరారు. జిల్లా కేంద్రంలో నిర్మించనున్న యుటిఎఫ్‌ జిల్లా కార్యాలయ నిర్మాణానికి అందరూ సహకరించాలని కోరారు. సమావేశంలో జిల్లా కోశాధికారి జె.వాల్యానాయక్‌, కార్యదర్శులు కె.శ్రీనివాస్‌రెడ్డి, సహాధ్యక్షులు ఎం.మోహన్‌రావు, ఎ.భాగేశ్వరిదేవి, జిల్లా కార్యదర్శి ఆర్‌.అజరు కుమార్‌, ఎం.రవిబాబు, అయేషా సుల్తానా, కాంతారావు, టి.వెంకటేశ్వర్లు, చిన్నం శ్రీనివాసరావు, కె.తిరుపతి స్వామి, ఎ.శ్రీనివాసరావు, శేషగిరి, షేక్‌ కాసింపీరా, యు.రాజశేఖర్‌రావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జి.విజయకమల పాల్గొన్నారు.