ప్రజాశక్తి-పాడేరు టౌన్: పనులు పురోగతిలో ఉన్నాయి, పనులు జరుగుతున్నాయని ఎంతకాలం చెబుతారు, తాగునీటి పథకాల నిర్మాణాలు జాప్యం చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ హెచ్చరించారు. పాడేరు డివిజన్ పరిధిలో జరుగుతున్న తాగునీటి పథకాల నిర్మాణాలపై గ్రామీణ నీటి సరఫరా విభాగం ఇంజనీరింగ్ అధికారులతో సోమవారం ఆయన కార్యాలయంలో మండలాల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రావిటీ పథకాలు, బోరుబావులు నిర్మాణం, పైపులైన్లు పురోగతి, బిల్లు వెబ్సైట్ నమోదు, వేసవి కార్యచరణ ప్రణాళికలపై ఆరా తీసారు. టెండరు సొంతం చేసుకున్న కాంట్రాక్టర్లకు పనులు అప్పగించిన తరువాత నిర్మాణపు పనులు చేపట్టక పోతే రాత పూర్వకంగా నోటీస్ జారీ చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. పనులు సకాలంలో పూర్తి చేయలేదని అనంతగిరి మండలం డిఇ, డుంబ్రిగుడ ఎఇలపై ఆగ్రహం వ్యక్తం చేసారు. వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేయాలని సూచించారు. మార్చి 10వ తేదీలో పనులు పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు లక్ష్యాలను నిర్దేశించారు. నిర్మాణలు పూర్తి చేసిన పనులకు బిల్లులు ఆన్ లైన్‌లో నమోదు చేసి చెల్లింపులు జరిగే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో 11 మండలాల డిఇఇలు, ఎఇలు తదితరులు పాల్గొన్నారు.










