ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి : ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పథకాల ముసుగులో పార్టీ ప్రచార పర్వానికి తెరలేపాయా? అంటే మెజార్టీ ప్రజానీకం నుంచి ఔననే సమాధానం వినిపిస్తోంది. ముఖ్యంగా పార్వతీపురం, విజయనగరం జిల్లాల్లో ఈ రకమైన రాజకీయ వికట విన్యాసాలు స్పష్టంగానే కనిపిస్తున్నాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని, ప్రభుత్వ ఖర్చుతో వచ్చే ఎన్నికలే లక్ష్యంగా ప్రచారం సాగిస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో గెలిచేవరకే పార్టీ ప్రతినిధి. గెలిచాక రాజకీయాలకు అతీతంగా ప్రజలకు సేవలందించాల్సివస్తుంది. ఆ అధికారం ఉన్నంత వరకూ ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగపడాలే తప్ప, తాను ప్రతినిధ్యం వహిస్తున్న పార్టీకి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఉపయోగపడే విధంగా వ్యవహరించడానికి వీలు లేదు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. ముఖ్యంగా రాష్ట్రం ప్రభుత్వం 'మా నమ్మకం నువ్వే జగన్' అంటూ మూడు రోజుల క్రితం చేపట్టిన విషయం విధితమే. 15రోజులపాటు నిర్వహించనున్న ఈ కార్యక్రమాన్ని ఉత్సవంలా నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. ముందు రోజే ఊరంతా చాటింపులు వేస్తున్నారు. సచివాలయాల వద్ద పార్టీ జెండాలను ఆవిష్కరిస్తున్నారు. టెంట్లు, కుర్చీలు సమకూర్చి ప్రభుత్వ సంక్షేమ పథకాల కంటే వైసిపి, ముఖ్యంగా సిఎం జగన్ కోసమే ఎక్కువ ప్రచారం చేపడుతున్నారు. ఇది ఈనెల 23వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ ప్రచార పర్వం ముగుస్తున్న గ్రామాల్లో 'ఎపికి జగనన్నే సిఎం ఎందుకు కావాలి' అంటూ మరో కార్యక్రమం తలపెట్టారు. ఇందులో భాగంగా గ్రామ గ్రామాన ప్రచార బోర్డులు ఏర్పాటు చేయడంతోపాటు ఇంటింటికీ వాలంటీర్లు వెళ్లి వచ్చే ఎన్నికల్లో మళ్లీ జగన్ గెలుస్తేనే మేలు జరుగుతుందన్నట్టుగా చెబుతున్నారు. కాదు... కాదు... అలా ప్రభుత్వం వాలంటీలర్లతో బలవంతంగా చెప్పిస్తోంది. ఈ మొత్తం ప్రచార హోరులో వాలంటీర్లతోపాటు సచివాలయ సిబ్బందిని కూడా భాగస్వామ్యం చేయడం గమనార్హం. ప్రభుత్వ వైఖరిపై భిన్నమైన అభిప్రాయాలు ఉన్న సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు మాత్రం మాకేంటీ ఖర్మ అంటూ తూతూ మంత్రంగానే ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ మొత్తం కార్యక్రమానికి మండల స్థాయిలో ఇఒపిఆర్డిని నోడల్ ఆఫీసర్గా నియమించడం పట్ల కూడా అధికారులు, ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి, అసహనం వ్యక్తమౌతోంది. ఎంతకి అధికారం ఉంటే మాత్రం ప్రభుత్వ అధికారులు, సిబ్బందిని పార్టీకోసం ఇంతలా వాడుకోవడమా? అంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
మరోవైపు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఇదే పద్ధతిలో వ్యహరిస్తోంది. ఈనెల 15వ తేదీ నుంచి 'వీక్షిత్ భారత్ సంకల్ప్ యాత్ర' పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహించేందుకు సన్నద్ధమైంది. దేశవ్యాప్తంగా గిరిజనులు నివసిస్తున్న 110 జిల్లాలో తొలి విడతగా ఈ యాత్ర నిర్వహించేందుకు పథకం రూపొందించింది. ఈ కార్యక్రమం రాష్ట్రంలో పార్వతీపురం మన్యం జిల్లా నుంచి శ్రీకారం చుట్టేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే మండలాల వారీగా యాత్ర షెడ్యూల్ కూడా ఖరారైంది. ఇందులోనూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రచారం చేస్తామని ప్రభుత్వం బటయకు చెప్తున్నప్పటికీ, గిరిజన ప్రాంతంలో ఎన్నికల అజెండాలో భాగంగానే ఈ యాత్ర సాగుతుందని పలువురు విశ్లేషిస్తున్నారు. పోడు భూములపై గిరిజనులకు హక్కు కల్పించే అటవీహక్కుల చట్టాన్ని సరిగా అమలు చేయలేదు సరికాదా, తిరిగి ఆ చట్టానికి తూట్లు పొడుస్తున్న బిజెపి ప్రభుత్వం గిరిజనులను మాయ మాటలతో నమ్మించి, వచ్చే ఎన్నికల్లో మరోసారి రాజకీయంగా లబ్ధిపొందేందుకు ప్రయత్నిస్తోందని గిరిజన సంఘం, సిపిఎం తదితర ప్రగతిశీల శక్తులు చెబుతున్నాయి. ఇందుకనుగుణంగా గిరిజనులకు రక్షణ కవచంగా వున్న 1/70 చట్టం బిజెపి అధికారంలోకి వచ్చాక నీరు గారుసోతంది. ఇటువంటివన్నీ కప్పిపుచ్చుకనేందుకే ఈ యాత్ర నిర్వహిస్తున్నారని పలువురు వాఖ్యానిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికార దుర్వినియోగానికి పాల్పడడమే కాకుండా, ప్రభుత్వ సొమ్ముతో పార్టీ ప్రచారాలు చేసుకుంటున్నాయని జనం అంటున్నారు.