
పథకాల అమలులో నిర్లక్ష్యం
- కెవిపిఎస్, వ్యవసాయ కార్మిక సంఘం
- చలో విజయవాడ పోస్టర్ విడుదల
ప్రజాశక్తి - నంద్యాల
దళిత, గిరిజనులకు సంక్షేమ పథకాలు అమలు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి నిర్లక్ష్యం వహిస్తున్నాయని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సుధాకర్, జిల్లా ఉపాధ్యక్షులు డేవిడ్, కెవిపిఎస్ జిల్లా కోశాధికారి ఏసేపులు విమర్శించారు. ఈ నెల 29న కెవిపిఎస్, వ్యకాసం ఉమ్మడి సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన చలో విజయవాడ పోస్టర్‌ను శనివారం నంద్యాల పట్టణంలోని నరసింహయ్య భవనంలో వారు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాలకులు ఎస్‌సి, ఎస్‌టి కేసులు నిర్వీర్యం చేస్తున్నారని, సబ్ ప్లాన్ చట్టాన్ని పూర్తిగా ఎత్తివేశారని తెలిపారు. ఎస్సీ కార్పొరేషన్ నిధులను దారి మళ్ళించడం, ఎస్సీ ఎస్టీలకు ఉన్న 26 రకాల పథకాలు ఎత్తివేయడం పూర్తి అన్యాయమన్నారు. అసైన్మెంట్ చట్టంలో కొత్త ఆర్డినెన్స్ తీసుకొచ్చి పేదలకు భూములు లేకుండా చేస్తున్నారని తెలిపారు. ఇప్పటికీ భూమిలేని నిరుపేదలు లక్షల్లో ఉన్నా భూ పంపిణీ చేయకపోవడం అన్యాయమన్నారు. పేదలకు పంచడానికి భూములు ఉన్న వాటిని పరిశ్రమలకు, పెద్దలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. దళితవాడలో అనేక రకాల సమస్యలు ఉన్నా ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం మనువాద సిద్ధాంతంతో దళిత, గిరిజనులను అణచి వేస్తుందన్నారు. దళితులను అన్ని విధాలా ఆదుకోవాలని ఈనెల 25, 26వ తేదీలలో నంద్యాల జిల్లా వ్యాప్తంగా దళిత రక్షణ యాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 29న చలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు బంగారం, సుబ్బరాయుడు, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.