ప్రజాశక్తి - తాళ్లరేవు
వ్యవసాయం కలిసిరాక, అప్పుల బాధ తాళలేక పటవల పంచాయతీ ఇబిసి కాలనీకి చెందిన కౌలురైతు బావిశెట్టి శ్రీనివాసరావు(43) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు శ్రీనివాసరావు ఐదేళ్లుగా మూడు ఎకరాలను కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. దీని కోసం పలుచోట్ల అప్పులు చేశాడు. అప్పులు తీర్చేదారి లేక మదనపడ్డాడు. అప్పుల నేపథ్యంలో కుటుంబ కలహాలు కూడా ఏర్పడ్డాయి. దీంతో శ్రీనివాసరావు తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఆదివారం ఎప్పటిలానే పొలానికి వెళ్లాడు. అక్కడ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన తోటి రైతులు, కూలీలు అతన్ని వెంటనే కాకినాడ జిజిహెచ్‌కు తరలించారు. అప్పటి నుంచి జిజిహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమించడంతో మంగళవారం తెల్లవారు జామున మృతి చెందాడు. ఆయనకు భార్య గంగాభవాని, ఇద్దరు కుమారులు ఉన్నారు. కోరంగి ఎస్‌ఐ పి.శ్రీనివాస్‌కుమార్, రెవెన్యూ అధికారులు విచారణ చేపట్టారు. ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు పూర్తి స్థాయిలో తెలియాల్సి ఉందని వారు తెలిపారు.
బాధిత కుటుంబానికి రాజబాబు పరామర్శ
ఆత్మహత్యకు పాల్పడిన కౌలు రైతు బావిశెట్టి శ్రీనివాసరావు కుటుంబాన్ని ఎపి కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి వల్లు రాజబాబు మంగళవారం పరామర్శించారు. శ్రీనివాసరావు భార్య గంగాభవానితో మాట్లాడారు. వ్యవసాయం కోసం రూ.4లక్షల వరకూ అప్పులు చేశారని ఆమె తెలిపింది. దీంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకు న్నాడని వాపోయింది. రాజబాబు మాట్లాడుతూ అన్నపూర్ణగా పేరుగాంచిన కాకినాడ జిల్లాలో ఇటీవల కాలంలో ఐదుగురు కౌలు రైతులు చనిపోయార న్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో సాగు భారమైందన్నారు. ఫలితంగా కౌలు రైతులు అప్పుల ఊభిలో కూరుకుపోతున్నారన్నారు. కౌలు రైతు ఆత్మహత్య చేసుకుంటే పరిహారం ఇవ్వకుండా అధికారులు తాత్సారం చేస్తున్నారన్నారు. కుటుంబ కలహాల వల్ల చనిపోయారని నమోదు చేసుకుని బాధిత కుటుంబాలకు అన్యాయం చేస్తున్నారన్నారు. కుటుంబ కలహాలు ఏ కారణం వల్ల వచ్చినవో కూడా విచారణ చేయాలన్నారు. కుటుంబ కలహాలు అంటూ సింపుల్‌గా మూసేయడం సరైన పద్ధతి కాదన్నారు. బావిశెట్టి శ్రీనివాసరావు కుటుంబాన్ని ఆదుకోవాలన్నారు.










