ప్రజాశక్తి- పల్నాడు జిల్లా : నూతన సాంకేతిక పద్ధతులు అవలంబించి తక్కువ నీటి వనరుల ద్వారా బిందు సేద్యం విధానంలో కనీసం రెండెకరాల్లో మల్బరీ సాగు చేపట్టి పట్టు పరిశ్రమ స్థాపిస్తే ప్రతినెలా ఆదాయం పొందొచ్చని పట్టు పరిశ్రమ శాఖ పల్నాడు జిల్లా అధికారి పి.రాధారాణి చెప్పారు. వ్యవసాయ అనుబంధ రంగమైన పట్టు రైతులతోపాటు యువతకూ ఉపాధి కల్పిస్తుందన్నారు. మల్బరీ సాగు ద్వారా పట్టు పరిశ్రమ స్థాపిస్తే ఏడాది పొడువునా ఆదాయం వస్తుందని, వీటిని ఇసుక, మాగాణి, బీడు, చౌడు భూములు మినహా అన్ని రకాల నేలల్లో సాగు చేయొచ్చని తెలిపారు. పట్టు పరిశ్రమ స్థాపనకు ముందుకొచ్చే వారికి తమ శాఖ ద్వారా సలహాలు, సూచనలతోపాటు ప్రభుత్వ సహకారమూ ఉంటుందన్న ఆమె పట్టు పరిశ్రమపై ప్రజాశక్తికి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలను వివరించారు.
పట్టు రైతులకు ప్రభుత్వం అందించే సాయం?
ఎకరా మల్బరీ తోటకు 5500 మొక్కలను ఉచితంగా ఇస్తాం. వీటిని నాటేందుకు అయ్యే ఖర్చును మొక్కల సంఖ్య ఆధారంగా గరిష్టంగా ఏడాదికి రూ.18,750 ప్రోత్సాహకంగా మూడేళ్ల పాటు ప్రభుత్వం సాయం చేస్తుంది. పట్టు పరిశ్రమ స్థాపనకు రైతులు ముందుకొస్తే మల్బరీ తోట పెంపకం దగ్గర నుండి షెడ్ నిర్మాణం, నిర్వహణకు సంబంధించి ఔషధాలు వరకు 75 శాతం రాయితీ, ఎస్సీ, ఎస్టీలైతే 90 శాతం రాయితీలను 'సిల్క్ సమగ్ర', ఆర్.కె.వి.వై పథకాల కింద లభిస్తాయి.
ఇంకా ఎలాంటి ప్రోత్సాహకాలు ఉంటాయి?
పరిశ్రమ స్థాపించిన అనంతరం ప్రభుత్వ పట్టుగూళ్ల మార్కెట్లో అమ్మిన సి.బి రకం పట్టు గూళ్లకు కిలోకు రూ.20 చొప్పున, బి.వి రకం పట్టుగూళ్లకు కిలోకు రూ.50 చొప్పున ప్రోత్సాహకం ఇస్తుంది. చిన్న వయసు పట్టు పురుగుల పెంపకం కేంద్రం చాకీ సెంటర్ నందు పట్టు పురుగులు చాకీ కట్టించి పెంచిన రైతులకు ప్రభుత్వ పట్టుగూళ్ల మార్కెట్ నందు 100 బి.వి. గుడ్లకు రూ.వెయ్యి చొప్పున ప్రోత్సాహం ఇస్తుంది. ఎస్సీ, ఎస్టీలకు రూ.1800 ఇస్తుంది.
పల్నాడు జిల్లాలో ఎన్ని పరిశ్రమలున్నాయి? ఎంతమంది ఉపాధి పొందుతున్నారు?
పల్నాడు జిల్లాలో 200 ఎకరాలకుపైగా మల్బరీ సాగవుతున్నాయి. 60కు పైగా యూనిట్లు విజయవంతంగా కొనసాగు తున్నాయి. పరిశ్రమ నిర్వాహకులు కాకుండా వీటిపై ఆధారపడి ప్రత్యక్షంగా, పరోక్షంగా 300 మందికి పైగా ఉపాధి పొందుతున్నారు.
పరిశ్రమలు విజయవంతం కాకపోవడానికి కారణం?
పల్నాడు జిల్లాలో వాణిజ్య పంటలైన మిరప తోటలకు దగ్గరగా ఉన్న పట్టు పరిశ్రమలు మాత్రమే విజయవంతంగా కొనసాగలేకపోతున్నాయి. మిరప తోటలకు వినియోగించే క్రిమిసంహారక మందులు ప్రభావం సమీపంలోని మల్బరీ తోటలు సాగుపై పడుతోంది. ఆకు చూసేందుకు ఆరోగ్యంగా ఉన్నా వాటిని తిన్న పట్టు పురుగుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఒకసారి మిరపతోట సాగు చేసిన భూమిలో కనీసం 3 నుండి 4 ఏళ్ల వరకు మల్బరీ తోటకు అనుకూలంగా ఉండవు.
షెడ్ల నిర్మాణం సంరక్షణ ఎలా?
మల్బరీ తోట ఉన్న భూమిలోనే షెడ్ నిర్మాణం ఉంటే పరిశ్రమ నిర్వహణకు సులభంగా ఉంటుంది. ఊరి బయట పొలాల్లో షెడ్లు ఏర్పాటు చేసుకోవాలి. 50 అడుగుల పొడవు 20 అడుగుల వెడల్పు, 35 అడుగుల పొడవు 20 అడుగుల వెడల్పుతో షెడ్లు నిర్మిం చాల్సి ఉంటుంది. షెడ్ వ్యయం రూ.4 లక్షలైతే ఓసి, బీసీలకు 75 శాతం రాయితీ, ఎస్సీ, ఎస్టీలకు 90 శాతం రాయితీ ఇస్తారు. న్యూస్ పేపర్ పరిచి మల్బరీ కొమ్మలు వేయాలి. నేత్రికలు చాకి కట్టెలు ఏర్పాటు చేయాలి. షెడ్‌లో సున్నం, బ్లీచింగ్ కొట్టడంతో క్రిమి కీట కాలు నశించి పోవడం తెగులు అనేది ఉండ దు. పురుగులకు ఆహారంగా వేసిన మల్బరీ ఆకు అధిక సమయం తాజాగా ఉంటుంది.
పంట ఎంతకాలం వస్తుంది?
ఒకసారి మల్బరీ సాగు చేపడితే నేల స్వభాన్ని బట్టి 12 ఏళ్ల నుండి 15 ఏళ్ల పాటు నాణ్యమైన మల్బరీ ఆకులు ఉత్పత్తి అవుతాయి. ఆ తర్వాత తోట దున్ని వేసి మళ్లీ నాటు కోవడం ఉత్తమం.
రైతులకు ఏ విధంగా అవగాహన కల్పిస్తున్నారు?
'పట్టుబడి' కార్యక్రమం ద్వారా మల్బరీ తోటల సాగుపై అవగాహన కల్పించి తోటల పెంపకం, తర్వాత నిర్మించిన షెడ్లలో పట్టు పురుగుల పెంపకం యొక్క విధి విధానాలు, మార్కెట్ చేసుకునే విధానంపై రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తున్నాం. నరసరావుపేట, పిడుగురాళ్లలో సాంకేతిక కేంద్రాలు నడుపుతూ రైతులకు సలహాలు సూచనలు ఇస్తున్నాం.
మార్కెట్లో ఒడిదుడుకులు ఏమైనా ఉన్నాయా?
ఆవేమీ లేవు. ప్రభుత్వ పట్టుగూళ్ల విక్రయ కేంద్రాలు పలమనేరు, మదనపల్లి, హిందూపురం, కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్‌లో ఈ- మార్కెటింగ్ పద్ధతి ద్వారా పట్టు గూళ్ల కొనుగోలు జరుగుతున్నాయి. ప్రస్తుతం కిలో ధర రూ.580 ఉంది. ఆధునిక మార్కెటింగ్ సదుపాయం కారణంగా గణనీయంగా అదాయంగా లభిస్తుంది. పట్టు గుళ్ల విక్రయం అనంతరం వెంటనే నగదు చెల్లింపుల వ్యవస్థ ఏర్పాటైంది.
పరిశ్రమ స్థాపనకు ఎవర్ని సంప్రదించాలి?
పట్టుపర పరిశ్రమ స్థాపించి స్వయం ఉపాధి పొందాలనుకునేవారు పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని వినుకొండ రోడ్డులోని జిల్లా పరిశ్రమ శాఖ కార్యాలయంలో సంప్రదించవచ్చు. లేదా పరిశ్రమ సాంకేతిక అధికారి శ్రీధర్ ఫోన్ నం:9441030263కు సంప్రదించవచ్చు.
ఈ ఏడాది లక్ష్యం ఎంత?
ఈ ఏడాది 100 ఎకరాలకు మల్బరీ సాగుకు 20 వరకు షెడ్ల నిర్మాణం లక్ష్యం. అయితే వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో 22 ఎకరాలు మల్బరీ సాగు చేయించాం. తక్కువ నీటి వనరులున్న రైతులు సైతం బిందు సేద్యం విధానం ద్వారా మల్బరీ సాగు చేసుకో వచ్చు. సమగ్ర యాజమాన్య పద్ధతులను జోడించి అందుబాటులో ఉన్న నూతన రకపు వంగడాలతో పంటలను సాగు చేసుకోవాలి. స్వల్పకాలిక పంటల తరహాలో 45 రోజుల నుంచి 70 రోజులు ఆదాయం లభిస్తుంది. తెగుళ్లు సోకే అవకాశాలు తక్కువ. వాణిజ్య పంటల తరహాలో లక్షలాది రూపాయల్లో పెట్టుబడులు పెట్టి నష్టపోయే అవకాశం ఉండదు. రెండెకరాల్లో మల్బరీ సాగు చేపట్టి పట్టు పరిశ్రమ స్థాపిస్తే ఏడాదికి రూ.రెండు మూడు లక్షల నికర ఆదాయం పొందొచ్చు.
ఏయే నేలలు, ఏ సమయాలు మల్బరీ సాగుకు అనుకూలంగా ఉంటాయి?
చౌడు, ఇసుక పొర నేలలు మినహా అన్ని రకాల నేలలు మల్బరీ సాగుకు అనుకూలంగా ఉంటాయి. ఎర్ర నేలల్లో మల్బరీ నాణ్యత బాగుంటుంది. మిరప తోటలకు మల్బరీ తోటలు దూరంగా ఉండడం శ్రేయస్కరం. మిరప సాగు చేసిన పొలంలో 3 నుండి నాలుగేళ్ల వరకు మల్బరీ సాగు చేపట్టకుండా ఉండడం శ్రేయస్కరం. జూన్ నుండి మార్చి వరకు మల్బరీ సాగు చేసుకోవచ్చు. మల్బరీ రెండు రకాలు ఉన్నాయి. సి.బి రకం, బైవోల్ట్ రకం. సి.బి రకం వేడి వాతావరణంలో సైతం సాగు చేసుకోవచ్చు. బై వోల్ట్ రకం అధిక వర్షాలనూ తట్టుకుంటుంది. నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు బై వోల్డ్... సిబి రకం మార్చి నుండి జూన్ వరకు సాగు చేసుకోవాలి.
సాగు పద్ధతులు రైతులకు అర్థమవుతాయా?
మల్బరీ సాగు విధానం, పట్టుపురుగుల పెంపకం రైతులకు సులభంగానే అర్థమయ్యేలా అవగాహన కల్పిస్తున్నాం. ఇందులో 5 దశలు ఉంటాయి. గుడ్డు నుండి పురుగు బయటకు వచ్చేది మొదటి దశ. మూడు రోజుల తర్వాత జరానికి పోవడం జరుగుతుంది. 24 రోజుల్లో పురుగు రూపంలో లార్వా దశ వస్తుంది. 6 నుండి 8 రోజుల తర్వాత గూడు కట్టుకోవడాన్ని పీపా దశ అంటారు. 25వ రోజు మార్కెట్‌కు పోతుంది. ఈ- ఆక్షన్ ద్వారా ట్రైడర్స్‌కు విక్రయించాలి. ధర నచ్చకుంటే రెండు, మూడు ఆప్షన్లకు వెళ్లొచ్చు. విక్రయం అనంతరం గంట తర్వాత రైతు ఖాతాలోకి డబ్బులు జమవుతాయి.










