ప్రజాశక్తి - ఏలూరు
జిల్లాలో పట్టుపురుగుల పెంపకాన్ని (సెరీ కల్చర్) మరింత విస్తరించడంతోపాటు పెద్దఎత్తున మహిళలను ఈ రంగంలో ప్రోత్సహించేందుకు చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తెలిపారు. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు ఆయన సూచించారు. స్థానిక కలెక్టరేట్‌లోని గోదావరి సమావేశ మందిరంలో శనివారం కేంద్ర పట్టుపరిశోధన, శిక్షణా సంస్థ మైసూర్, అనంతపురం, ఆంధ్రప్రదేశ్ పట్టుపరిశ్రమల ఆధ్వర్యంలో బైవోల్టేన్ సెరీ కల్చర్‌తో స్థిర ఆదాయం-ఉత్పాధకత పెంచేందుకు అనుసరించాల్సిన సాంకేతిక పరిజ్ఞానంపై నిర్వహించిన వర్క్‌షాప్‌ను కలెక్టర్ ప్రారంభించారు. ఏలూరు, కాకినాడ, ఎన్‌టిఆర్, అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, కృష్ణ జిల్లాలకు చెందిన మల్బరీసాగు రైతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టుపరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతిస్తుందని, సాగుకు ముందుకు వచ్చే రైతులకు విధాలుగా తోడ్పాటునిస్తుందన్నారు. మహిళలు మల్బరీసాగువైపునకు రావాలని, వారికి కావాల్సిన ప్రోత్సాహాన్ని అందిస్తామని చెప్పారు. వ్యవసాయక ప్రాంతమైన ఏలూరు జిల్లాలో 1500 ఎకరాల్లో 570 మంది రైతులు సెరీ కల్చర్ సాగుచేయడం ఆశ్చర్యకరమైన విషయమన్నారు. ఎంతో సులభతరమైన ఈ రంగంవైపు రైతులు మళ్లేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాల పునర్విభజన అనంతరం ఏలూరు జిల్లాలో 50 శాతం వ్యవసాయం, మరో 50 శాతం ఉధ్యాన పంటలైన ఆయిల్ పామ్, మొక్కజొన్నవంటివి ఉన్నాయన్నారు. కొంతభాగం ఆక్వా కల్చర్ ఉందన్నారు. అయితే జిల్లాలో మల్బరీసాగుపై ముఖ్యంగా మహిళా రైతులను ప్రోత్సహించే దిశగా డిఆర్‌డిఎ, సెరీ కల్చర్, డ్వామా తదితర శాఖల సమన్వయంతో ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలన్నారు. మల్బరీసాగు ద్వారా ఏడాదికి రూ.ఐదు లక్షల వరకూ ఆదాయం పొందే అవకాశం ఉందన్నారు. ఆటోమెటిక్ రీలింగ్ యూనిట్ల స్థాపనపై కూడా దృష్టి పెట్టాల్సి ఉందన్నారు. ఇందుకు పిఎంఇజిపి ద్వారా సబ్సిడీతో కూడిన రుణాలు పొందొచ్చన్నారు. వంద మంది రైతులు కామన్ క్లస్టర్ సెంటర్ ఏర్పాటు చేసుకుంటే ప్రోసెసింగ్ యూనిట్లకు సబ్సిడీపై ఏర్పాటుకు సహకరిస్తామన్నారు. ఆత్మనిర్బర్ భారత్ కింద కూడా ఈ రంగం అభివృద్ధికి ప్రోత్సాహం పొందొచ్చన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న అనంతపురం కేంద్ర పట్టుపరిశోధనా, శిక్షణా సంస్థ ప్రధాన శాస్త్రవేత్త, డాక్టర్ కెపి.కిరణ్ కుమార్, మైసూర్ కేంద్ర పట్టుపరిశోధన, శిక్షణా సంస్థ డైరెక్టర్ డాక్టర్ మేరీ జోసఫ్, ఎపి సెరీ కల్చర్ అడిషనల్ డైరెక్టర్ సి.అరుణకుమారి, కృష్ణగిరి ఆర్‌ఇసి శాస్త్రవేత్త డాక్టర్ కె.ఝాన్సీలక్ష్మి, సిఎస్‌ఎస్ బి రిటైర్డ్ శాస్త్రవేత్త డాక్టర్ పి.సుధాకర్, గుంటూరు సెరీ కల్చర్ డిప్యూటీ డైరెక్టర్ సాజిదాబేగం, ఏలూరు, కాకినాడ, ఎన్‌టిఆర్ జిల్లాల సెరీ కల్చర్ అధికారులు డి.వాణి, బిఎంవి.రాజు, ఎన్.సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్బంగా సెరీ కల్చర్ సాగులో ఉత్తమ రైతులుగా నిలిచిన వారిని కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ శాలువా, మెమెంటోలతో సత్కరించారు.










