Aug 17,2022 22:14

హత్యకు గురైన అనిల్‌కుమార్‌

ప్రజాశక్తి - ఎంవిపి కాలనీ       పట్టపగలే, నడిరోడ్డుపై జనసమక్షంలో రౌడీషీటర్‌ దారుణహత్యకు గురికావడం విశాఖ మహా నగరంలో కలకలం రేపింది. సెటిల్మెంట్లు, పాత కక్షలు నేపథ్యంలోఈ దారుణ ఘటన చోటుచేసుకుందని అనుమానిస్తున్నారు. వివరాలివి.
నగరంలోని ఉషోదయ జంక్షన్‌లోని అనుపమ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ వద్ద బుధవారం సాయంత్రం రౌడీషీటర్‌ హత్య సంచలనం సష్టించింది పాత కక్షలు నేపథ్యంలో అప్పుఘర్‌ ప్రాంతానికి చెందిన వాసుపల్లి అనిల్‌కుమార్‌ (32)ను ఆదర్శనగర్‌ ప్రాంతానికి చెందిన వాసుపల్లి శ్యామ్‌ప్రకాష్‌ అతి కిరాతకంగా కత్తితో మెడ కోసి నడిరోడ్డుపై పట్టపగలు హతమార్చాడు. పోలీసుల అందించిన ప్రాథమిక సమాచారం ప్రకారం హతుడు అనిల్‌కుమార్‌ గతంలో కాకినాడలో సెటిల్మెంట్లు చేస్తూ ఉండేవాడు. కాకినాడలో అతనిపై రౌడీ షీట్‌ ఉంది. అంతేకాకుండా నగరంలో కూడా పలు సెటిల్మెంట్లకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. మృతుడు అనిల్‌కుమార్‌కు, నిందితుడు శ్యామ్‌ ప్రకాష్‌ మధ్య కొంతకాలంగా అంతర్గత విభేదాలున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే బుధవారం మధ్యాహ్నం నాలుగు గంటల సమయంలో ఉషోదయ జంక్షన్‌లోని అనుపమ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లో ఇద్దరూ మద్యం తాగారు. మద్యం మత్తులో ఘర్షణ జరగ్గా, నిందితుడు వాసుపల్లి శ్యామ్‌ప్రకాష్‌ తన వద్ద ఉన్న కత్తితో వాసుపల్లి అనిల్‌కుమార్‌ మెడ కోసి హత్య చేశాడు. నిందితుడు శ్యామ్‌ ప్రకాష్‌ను సిటీ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. విచారణ అనంతరం పూరి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.