Aug 29,2023 20:17

బాలికను పరామర్శిస్తున్న బీవీ

ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
పట్టణంలో వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయని, మున్సిపల్‌ కమిషనర్‌ గంగిరెడ్డి పట్టించుకోవడం లేదని మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ బీవీ.జయనాగేశ్వర్‌రెడ్డి విమర్శించారు. పట్టణంలోని 16వ వార్డులో కుక్కల దాడిలో గాయపడిన చిన్నారి బోయ పార సంగీతను మంగళవారం పట్టణ టిడిపి నాయకులతో కలిసి పరామర్శించారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితి గురించి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పట్టణంలో కుక్కలను కూడా నివారించలేని చేతకాని మున్సిపల్‌ కమిషనర్‌ గంగిరెడ్డి అని మండిపడ్డారు. మూగజీవాలను తానూ చంపమని చెప్పడం లేదని, వాటిని పట్టుకొని తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. పట్టణంలో ఎక్కడ చూసినా రోడ్లకు అడ్డంగా పశువులు, కుక్కలు స్వైర విహారం చేస్తూ చిన్నారులు, పాదచారులపై దాడులు చేస్తున్నాయని చెప్పారు. మున్సిపల్‌ కమిషనర్‌ గంగిరెడ్డి పాలన మరిచి వైసిపి తొత్తుగా వ్యవహరిస్తూ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. కమిషనర్‌ గంగిరెడ్డికి వైసిపి అంటే మక్కువ ఉంటే కండువా కప్పుకొని కౌన్సిలర్‌గా వైసిపి తరపున పోటీ చేయాలని హితవు పలికారు. గ్రేడ్‌-1 మున్సిపాలిటీని అవినీతి మున్సిపాలిటీగా మార్చి పట్టణంలో కనీసం కుక్కలను కూడా నియంత్రించలేని స్థితికి మున్సిపాలిటీని దిగజార్చిన ఘనత వైసిపి నాయకులు, మున్సిపల్‌ అధికారులకు దక్కిందని విమర్శించారు. కమిషనర్‌ ఛాంబర్‌ను రియల్‌ ఎస్టేట్‌ దందాలు, వ్యాపారాలకు అడ్డాగా మార్చారని మండిపడ్డారు. రాబోయే రోజుల్లో మున్సిపల్‌ కమిషనర్‌ గంగిరెడ్డి ఎక్కడ ఉన్నా ఆయన అవినీతి చిట్టా మొత్తం బయటకు తీసి తగిన చర్యలు తీసుకునే వరకు నిద్రపోమని హెచ్చరించారు. ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే కమిషనర్‌ గంగిరెడ్డి లాంటి వారిని సస్పెండ్‌ చేయాలని తెలిపారు.