పట్టణంలో 'ఉపాధి ' పనులు కల్పించాలి : సిపిఎం
ప్రజాశక్తి - ఆత్మకూర్
పట్టణ ఉపాధి హామీ చట్టాన్ని ఆత్మకూరు మున్సిపాలిటీలో అమలు చేసి వ్యవసాయ కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని సిపిఎం పట్టణ కార్యదర్శి ఏ. రణధీర్, పట్టణ నాయకులు షేక్ ఇస్మాయిల్ సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులను కోరారు. సోమవారం వారు విలేకరులతో మాట్లాడుతూ కేరళ, త్రిపుర, పశ్చిమబెంగాల్లో వామపక్ష ప్రభుత్వాల పాలనలో పట్టణ ఉపాధి హామీ పథకాలు అమలు చేశాయని, అందుకు ఆయా రాష్ట్రాలు అప్పుడే చట్టాలను కూడా చేశాయని అన్నారు. 2020 నుంచి ఒరిస్సా, హిమాచల్ ప్రదేశ్ ఝార్ఖండ్ రాష్ట్రాల్లోనూ పట్టణ ఉపాధి హామీ పథకం పనులు అమలవుతున్నాయన్నారు. ఆయా రాష్ట్రాల మాదిరిగా ఆంధ్రప్రదేశ్‌లోనూ మున్సిపల్ పట్టణాలలో కూలీ పనులు కల్పించాలన్నారు. సమావేశంలో శివుడు, గణపతి, రాముడు, తదితరులు పాల్గొన్నారు.










