
ప్రజాశక్తి - భీమవరం
పట్టణంలో చేపట్టిన పలు మున్సిపల్ పనులను, ఓటర్ల జాబితా స్వచ్ఛీకరణను శుక్రవారం జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. జెపి రోడ్డు అయ్యప్ప స్వామి టెంపుల్ 34వ వార్డు ప్రాంతంలోని రోడ్డు మార్జిన్‌లోని డ్రెయిన్‌ను పరిశీలించారు. డ్రెయిన్ నిర్మాణం కారణంగా దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేయించాలని సూచించారు. అనంతరం 20వ వార్డులోని ఎడ్వర్డ్ ట్యాంక్ వద్ద డ్రెయిన్‌ను పరిశీలించారు. డ్రెయిన్ పనులను త్వరితగతిన చేపట్టాలని, ఎడ్వర్డ్ ట్యాంకు చుట్టుపక్కలా మొక్కలు నాటించాలని తెలిపారు. అనంతరం బిసి కాలనీలో అమృత్ 2.0 నిధులు రూ.2.14 కోట్లతో నిర్మించిన 10 లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన వాటర్ ట్యాంకును సందర్శించారు. త్వరగా పైపులైను పనులను పూర్తిచేసి తాగునీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వాటర్ ట్యాంకు ముందు భాగంలో ఖాళీగా ఉన్న ప్రాంతంలో మొక్కలు నాటించాలని సూచించారు. వాటర్ ట్యాంకు మార్గంలో రోడ్డు ఏర్పాటుకు ప్రతిపాదనలు తయారు చేయాలన్నారు. ఒకటో వార్డు సిపిఎం కార్యాలయం నుంచి బైపాస్ రోడ్డు వరకూ రోడ్డు విస్తరణ పనులను, వంతెన ప్రాంతాన్ని సందర్శించారు. వంతెన మార్జిన్‌లో నీరు నిలవకుండా ఉండేలా పనులను చేపట్టాలన్నారు. శ్రీఅడబాల వెంకట చందర్రావు మున్సిపల్ స్పెషల్ ప్రాథమిక పాఠశాల వద్ద ఓటర్ల సర్వేపై బిఎల్‌ఒలతో మాట్లాడారు. కొత్త ఓట్లకు ఎన్ని దరఖాస్తులందాయి, ఎన్ని ఎన్రోల్ చేశారు, డెత్ కేసులు, షిఫ్ట్టెడ్ కేసులు, 100 సంవత్సరాలు వయసు పైబడి ఉన్నవారు ఎంతమంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట మున్సిపల్ ఇంజినీర్ త్రినాధరావు, ఇన్‌ఛార్జి మున్సిపల్ డిఇ, పబ్లిక్ హెల్త్ ఇఇ విజరు, ఎఇ నవ్య, మున్సిపల్ అధికారులు ఉన్నారు