Sep 17,2023 01:24

ప్రజాశక్తి - రేపల్లె
 పట్టణంలో దోమలు దడపుట్టిస్తున్నయి. సాయంత్రం అయితే ఇంటా, బయట ఎక్కడ నిలబడిన దోమలు పీక్కు తింటున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా పురపాలక సంఘంలో దోమలు బెంబేలెత్తిస్తున్నాయి. ఎవ్వరి నోట విన్నా దోమలు బాబోయ్ దోమలు అంటున్నారు. నియంత్రణ చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు. సాయంత్రం ఆరు గంటల సమయంలో దోమలు ఈగల గుంపు మాదిరి పురవీధుల్లో దండయాత్ర చేస్తున్నాయని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే ప్రజలు మలేరియా, విషజ్వరాలు, అక్కడక్కడ డెంగ్యూ జ్వరాలతో బాధపడుతున్నారు. పట్టణంలో దోమలు సంచారం అధికంగా ఉన్న మున్సిపల్ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవటం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. పట్టణంలో ప్రజారోగ్యానికి పాలకులు, అధికారులు ఏ మాత్రం శ్రద్ద కనపర్చటం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఏ వార్డులో చూసిన దోమ కాటుతో ప్రజలు జ్వరాల భారిన పడుతున్నారు. గతంలో పారిశుద్ధ్య కార్మికులు ప్రతిరోజు డ్రైనేజీలలో పేరుకు పోయిన మురుగును తొలగించే వారు. దోమల వ్యాప్తిని అరికట్టేందుకు ప్రతి వార్డులో వారానికి రెండుసార్లు ఫాగింగ్ చేసేవారు. ప్రస్తుతం పాలకవర్గం వచ్చినప్పటి నుండి ఫాగింగ్ చెయ్యక పోవటంతో దోమలు మరింతగా అభివృద్ధి చెందాయి. మరో ప్రక్క చేపలు, రొయ్యలు, పీతల వ్యాపారులు ప్రధాన రోడ్లపైనే ప్రాసెస్ చేసి వేస్ట్ వాటర్‌ను డ్రైనేజీలోకి వదలటంతో దోమలకు ఆవాసాలుగా మారాయి. మురుగు పారని డ్రెయిన్లు, వర్షం వస్తే తటాకాలను మరిపించే మార్గాలు, చెత్తాచెదారాలు, మురుగు దుర్వాసనలతో పట్టణవాసులు దుర్భర జీవితం గడుపుతున్నారు. శివారు ప్రాంతాలు, మురికివాడల్లో అయితే అన్నీ సమస్యలే. ఇక దోమలు, కుక్కలు, పందులు ఇలా ఎన్నో ఎన్నెన్నో సమస్యలతో పట్టణ ప్రజలు సహజీవనం చేస్తున్నారు. పాలకులు మారుతున్నా సమస్యలు తరగడంలేదు. ఏటికేడు పెరుగుతూనే ఉన్నాయి. ప్రజలు ఆవేదన ఆలకించేవారే లేరు. ముక్కు పిండి పన్నులు వసూలు చేస్తున్నారు. సమస్యల్లో పుట్టి, సమస్యల మధ్య పెరుగుతూ, సమస్యలతో కాలం వెళ్లదీయాల్సి వస్తోందని పురప్రజలు వాపోతున్నారు. ప్లాస్టిక్‌ వినియోగం నియంత్రణలో అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఫలితంగా ఏ కాల్వలో చూసినా ప్లాస్టిక్‌ కవర్లు, ప్లాస్టిక్‌ వ్యర్థాలు పేరుకుపోయి మురుగు పారుదలకు ఆటంకంగా కనిపిస్తున్నాయి. అధికారుల్లో సరైన చిత్తశుద్ది లేకపోవడంతో లక్ష్యం గాడి తప్పుతుంది. సమస్య ఉందని అధికారులకు తెలియజేస్తే సమస్య కంచికి.. మనం ఇంటికి వెళ్ళే సందర్భాలు చోటు చేసుకుంటున్నాయి. వేలకు వేలు వేతనాలు తీసుకుంటూ ప్రజలకు మాత్రం న్యాయం చేయలేకపోతున్నారు. ముక్కుపిండి పన్నులు వసూలు చేయడంలో ఉన్న శ్రద్ద సేవలందించడంలో చూపడంలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైన మున్సిపల్ అధికారులు స్పందించి దోమల నియంత్రణకు చర్యలు తీసుకుని ప్రజారోగ్యాన్ని కాపాడాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.