
ప్రజాశక్తి - చీరాల
పాలకులు, మున్సిపల్ అధికారులు పట్టణ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి వివిధ వార్డుల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిపిఎం కార్యదర్శి ఎన్ బాబురావు కోరారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో సిపిఎం నాయకులు మున్సిపల్ కమిషనర్ కె రామచంద్రారెడ్డికి వినత పత్రం శుక్రవారం అందజేశారు. సందర్భంగా నవంబర్ 3, 4 తేదీల్లో పట్టణంలో చేపట్టిన సిపిఎం పాదయాత్రలో గుర్తించిన అనేక సమస్యలను పరిష్కరించే దిశగా అధికారులు, పాలకవర్గం కృషి చేయాలని కోరారు. సిపిఎం మాట్లాడుతూ పట్టణంలో అనేక సమస్యలు పాదయాత్రలో తమ దృష్టికి వచ్చాయని అన్నారు. ఇళ్ల స్థలాల పేరుతో ప్రజలకు భరోసా పత్రాలు ఇచ్చి అధికారులు కాలయాపన చేస్తున్నారని అన్నారు. పట్టణానికి పడమర వైపు ఉన్న విఠల్ నగర్, వైకుంటపురం, దండుపాట ప్రాంతాలలో కాలువలో వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో ఇళ్లలోకి నీరు చేరి ఆ ప్రాంతాలు నీట మునుగుతున్నాయని చెప్పారు. రోశయ్య కాలనీలో కట్టిన ఇళ్లు శిథిలావస్థకు చేరాయని అన్నారు. ప్రజలకు గూడు లేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. కుందేరు ఆక్రమణలకు గురవుతూ రోజురోజుకు కుదించుకపోతుందని అన్నారు. దీంతో రానున్న రోజుల్లో ముంపు ప్రమాదం ఉందని గుర్తు చేశారు. ఇలా వందల కొద్ది సమస్యలు పట్టణ ప్రజలను వేధిస్తున్నాయని అన్నారు. ఇటువంటి సమస్యలపై దృష్టి పెట్టకుండా పాలకులు, అధికారులు నిధులను దారి మళ్లించి సొమ్ము చేసుకుంటున్న పరిస్థితులు ఉన్నాయని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఎం వసంతరావు, ఎల్ జయరాజు పాల్గొన్నారు.