ప్రజాశక్తి- పిఎం పాలెం, మధురవాడ : జివిఎంసి 5, 6, 7వార్డుల పరిధిలో ఉన్న పిఎం.పాలెం, కొమ్మాది, స్వతంత్రనగర్, మారికవలసలో సుమారు రూ.4 కోట్లతో నిర్మించిన పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని, భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు సోమవారం ప్రారంభించారు. ముందుగా 6వ వార్డు పరిధి పిఎం.పాలెంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ, నాడు నేడు పథకం ద్వారా రాష్ట్రం మొత్తం మీద అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే నూతన అర్బన్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లను నిర్మిస్తున్నట్లు చెప్పారు. అత్యాధునిక వైద్య సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున, జివిఎంసి కమిషనర్ లకీëశ, మేయర్ గొలగాని హరి వెంకటకుమారి, డిఎంహెచ్‌ఒ విజయలక్ష్మి, సిఎంహెచ్‌ఒ శాస్త్రి, నగరాల కార్పొరేషన్ చైర్మన్ పిల్లా సుజాతసత్యనారాయణ, జోనల్ కమిషనర్ బొడ్డేపల్లి రాము, 6వ వార్డు కార్పొరేటర్ ముత్తంశెట్టి లకీëప్రియాంక, 5వ వార్డు కార్పొరేటర్ మొల్లి హేమలత, 7వ వార్డు టిడిపి కార్పొరేటర్ పిల్లా మంగమ్మ, 8వ వార్డు కార్పొరేటర్ లోడగల అప్పారావు తదితరులు పాల్గొన్నారు.










