Aug 04,2023 22:53

మాట్లాడుతున్న రాష్ట్ర మున్సిపల్‌ శాఖ కమిషనర్‌ కోటేశ్వరరావు

- రాష్ట్ర మున్సిపల్‌శాఖ కమిషనర్‌ పి.కోటేశ్వరరావు
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్‌: 
రాష్ట్రవ్యాప్తంగా నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీలతో పాటు పట్టణ ప్రాంతాల్లో సమగ్ర భూ సర్వే నిర్వహించనున్నట్లు రాష్ట్ర మున్సిపల్‌ శాఖ కమిషనర్‌ పి.కోటేశ్వరరావు వెల్లడించారు. ఇందులో భాగంగా 123 మున్సిపాల్టీల్లో యుద్ధప్రాతిపదికన సమగ్ర భూ సర్వే చేపట్టనున్నట్లు చెప్పారు. జగనన్న భూ హక్కు- భూ రక్ష చట్టంపై జిల్లాలోని మున్సిపాల్టీల్లో పనిచేస్తున్న సర్వేయర్లు, ఇతర సిబ్బందికి నగరంలోని ఒక ఫంక్షన్‌ హాల్‌లో శిక్షణా తరగతులను శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూ సర్వేలో ఇప్పటివరకు గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టడమైందని, ఇకపై పట్టణ ప్రాంతాల్లో ప్రారంభం కానుందన్నారు. పట్టణ ప్రాంతాల్లో ఉన్న మున్సిపల్‌ ఆస్తుల పరిరక్షణకు ఇది ఎంతగానో తోడ్పడతుందన్నారు. పట్టణ ప్రాంతాల్లో ఉన్న భూముల సర్వే సమర్థవంతంగా నిర్వహించి లబ్ధిదారులకు భూహక్కు పత్రాలను అందిస్తామన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని సమగ్రంగా భూ సర్వే చేపట్టి పట్టణ ప్రాంతాల్లో ఉన్న వారికి భూ హక్కు పత్రాలు ఇవ్వనున్నట్టు తెలిపారు. ప్రతి సర్వే నంబరుకు హద్దులు నిర్ణయించి డ్రోన్‌ కెమెరాల సహాయంతో మ్యాపులు తయారు చేసి ఎవరికీ అన్యాయం కాకుండా న్యాయం చేస్తామన్నారు. మున్సిపాల్టీ, వార్డు సచివాలయ సిబ్బందికి అవగాహన కల్పించే ఉద్దేశంతో ఏర్పాటు చేస్తున్న సదస్సులు జిల్లా నుంచి ప్రారంభించామన్నారు. కార్యక్రమంలో కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌, అర్బన్‌ రీసర్వే ప్రత్యేక అధికారి బి.సుబ్బారావు, జాయింట్‌ కలెక్టర్‌ ఎం.నవీన్‌, అదనపు డైరెక్టర్‌ ప్రభాకరరావు, జిల్లాలోని మున్సిపాల్టీల కమిషనర్లు, రెవెన్యూ, వార్డు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.