Jul 31,2023 00:27
కూరగాయల మార్కెట్‌ వద్ద ప్రారంభించబోతున్న ప్రభుత్వ మద్యం దుకాణం

ప్రజాశక్తి-చీరాల: పట్టణ నడిబొడ్డులో ఉన్న నెహ్రూ కూరగాయల మార్కెట్‌ సమీపాన ప్రభుత్వ మద్యం దుకాణం ఏర్పాటు చేయడాన్ని ఆ ప్రాంత వాసులందరూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నిత్యం కూరగాయల మార్కెట్‌ వద్ద మహిళలతో రద్దీగా ఉండే ప్రాంతంలో మందుబాబులకు కేంద్రంగా నిలిచే విధంగా ప్రభుత్వ మద్యం దుకాణం ఆ ప్రాంతంలో ఏర్పాటు చేయటం ఏంటని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఓవైపు కస్తూర్బాగాంధీ బాలికల హైస్కూల్‌, మరోవైపు కూరగాయల మార్కెట్‌, ఆ వెంటనే పచారి దుకాణాలు, మార్కెట్‌కు సమీపంలో భావనారుషి దేవస్థానం వీటన్నింటికీ ప్రధాన కేంద్రంగా ఉన్న ప్రాంతంలో ఎలాంటి బహిరంగ ప్రకటన లేకుండా, గుట్టు చప్పుడు కాకుండా, మహిళల సమస్యలను గుర్తించకుండా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చూస్తున్న మద్యం దుకాణాన్ని తక్షణమే నిలుపుదల చేయాలని ఆ ప్రాంతవాసులు కోరుతున్నారు. ఈ విషయంపై సోమవారం కలెక్టర్‌ కార్యాలయంలో జరగనున్న స్పందన కార్యక్రమానికి ఆ ప్రాంతవాసులు అందరూ హాజరై తమ సమస్యను కలెక్టర్‌ దృష్టికి తీసుకువెళ్లనట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో నేడు జరగనున్న మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఈ సమస్యపై కౌన్సిలర్లు చర్చిస్తారో లేక పట్టీపట్టనట్లు వ్యవహరిస్తారో వేచి చూడాల్సిఉంది.
మద్యం దుకాణం తక్షణమే నిలిపివేయాలి: సిపిఎం ప్రాంతీయ కార్యదర్శి ఎన్‌ బాబురావు
నిత్యం మహిళలతో, పాఠశాల, కళాశాలకు వెళ్లే విద్యార్థినులతో రద్దీగా ఉండే కూరగాయల మార్కెట్‌ సమీపంలో ప్రధాన రహదారిపై ప్రభుత్వం మద్యం దుకాణం ఏర్పాటు చేయటం అప్రజాస్వామికమని, ప్రభుత్వ ఉన్నత అధికారులు పర్యవేక్షించి తక్షణమే మద్యం దుకాణ ఏర్పాట్లను నిలిపివేయాలని సిపిఎం ప్రాంతీయ కార్యదర్శి ఎన్‌ బాబురావు అన్నారు. ఆ ప్రాంతవాసులు ఎదుర్కొంటున్న సమస్యపై సిపిఎం అన్ని వేళలా ఆ ప్రాంత వాసులకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు. తక్షణమే మద్యం దుకాణ పనులు నిలుపుదల చేయకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
మహిళలకు ఇబ్బంది కలిగిస్తే సహించేది లేదు: ప్రజా వేదిక
రాష్ట్ర అధ్యక్షులు గుమ్మడి ఏసురత్నం
ప్రభుత్వ మద్యం దుకాణం కూరగాయలు మార్కెట్‌ వద్ద ఏర్పాటు చేయటం మంచి పద్ధతి కాదని, తక్షణమే ప్రభుత్వం పునరాలోచించి మరో ప్రాంతంలో దుకాణాన్ని ఏర్పాటు చేసుకోవాలని ప్రజావేదిక రాష్ట్ర అధ్యక్షులు గుమ్మడి ఏసురత్నం అన్నారు. మహిళలకు, విద్యార్థినులకు, ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే తాము ఆందోళన కార్యక్రమాలు చేపడతామని, తక్షణమే ప్రభుత్వ అధికారులు ప్రజల విన్నపాలను దృష్టిలో ఉంచుకొని మద్యం షాపును ఏర్పాటు ప్రయత్నాన్ని విరమించుకోవాని సూచించారు. ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా ప్రభుత్వ అధికారుల ప్రవర్తన ఉంటే తప్పనిసరిగా తాము ఆందోళన కార్యక్రమాలు చేస్తామని స్పష్టం చేశారు.