Jul 14,2023 23:24

ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : గుంటూరు, పల్నాడు జిల్లాల్లో ఈ ఏడాది ఖరీఫ్‌లో పత్తి సాగు వైపు ఎక్కువ మంది రైతులు మొగ్గుచూపుతున్నారు. మిర్చి ధరలు ఆశాజనకంగా ఉన్నా ఈ ఏడాది నీటి ఎద్దడి పొంచి ఉండటంతో మిర్చి సాగు చేసేరైతులు పునరాలోచనలో పడ్డారు. మిర్చికి తప్పని సరిగా నీటి వినియోగం ఎక్కువగా అవసరం ఉంది. గత సీజన్‌లో మిర్చి సాగు కొంత ఆశాజనకంగా ఉన్నా వేసవిలో కురిసిన అకాలవర్షాలకు ఎక్కువ మంది రైతులు నష్టపోయారు. కల్లాల్లో ఆరబోసిన రైతులకు నష్టం జరిగినా పరిహారం రాలేదు.2021లో తామర తెగులు సోకి ఉమ్మడి గుంటూరు జిల్లాలో దాదాపు 1.90 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. అప్పట్లో 50 వేల మంది రైతులు నష్టపోయారు.వారికి పరిహారం రాలేదు. తామర తెగులు నివారణకు అవసరానికి మించి పురుగుమందులు వినియోగించాల్సి వచ్చింది. అయితే గత నాలుగేళ్లుగా జలాశయాల్లో నీటి నిల్వలు పుష్కలంగా ఉండటం వల్ల మిర్చికి మూడు తడులకు నీటిఎద్దడి లేకుండా పోయింది. ఈసారి మళ్లీ ఐదేళ్ల క్రితం ఉన్నపరిస్థితి వస్తుందని చెబుతున్నారు. పల్నాడులో 3.10 లక్షల ఎకరాల్లో పత్తి పండిస్తారని అంచనా ఉండగా ఇప్పటివరకు 30 వేల ఎకారాల్లో వేశారు. గుంటూరు జిల్లాలో 77 వేల ఎకరాల్లో పత్తిసాగు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు 5,040 ఎకరాల్లో పత్తిసాగు జరిగింది. రెండు జిల్లాలో కలిపి 1.80 లక్షల ఎకరాల్లో మిర్చిసాగుఅవుతుందని అంచనా ఉండగా ఈఏడాది మిర్చి సాగు ఇంకా ప్రారంభం కాలేదు. మొత్తంగా గత నాలుగేళ్లలో మిర్చికి పెట్టుబడులు మరింత పెరిగాయి. ధరలు కూడా బాగా రావడం వల్ల కొంత మంది రైతులు పెట్టుబడులకు నష్టం లేకుండాబయటపడుతున్నారు.
ఈఏడాది ఆల్మట్టి,నారాయణపూర్‌,జూరాల తదితర జలాశయాలకు నీరురావడంలేదు. అంతేగాక పల్నాడు జిల్లాతోపాటు గుంటూరుజిల్లాలోని మెట్ట ప్రాంతాల్లో వర్షాలు ఆశాజనకంగా లేవు. పల్నాడులో జులైలో131 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా ఈ నెలలో ఇప్పటి వరకు కేవలం 41.7మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. గుంటూరు జిల్లాలో జులైలో 164.9మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా శుక్రవారం వరకు 128.5 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో రైతులుమిర్చి సాగుపై ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మిర్చి సాగు కన్నా పత్తి సాగు మేలన్న భావనలో రైతులు ఉన్నారు. పత్తి క్వింటాళ్‌ రూ. 8 నుంచి 9 వేలవరకు లభిస్తుందని ఆశిస్తున్నారు. అందువల్ల రైతులు పత్తిసాగుపై దృష్టిసారిస్తున్నారు.
అంతేగాక పల్నాడు ప్రాంతంలో నీటి వసతి ఉన్నా మాగాణి భూములు తప్ప మిగతా ప్రాంతాల్లో వరి సాగు కి రైతులు విముఖత వ్యక్తం చేస్తున్నారు. మూడేళ్లుగా వరి సాగు చేసిన రైతులకు కనీస మద్దతు ధర కూడా లభించడం లేదు. పెట్టిన పెట్టుబడులకి కనీస గిట్టుబాటు ధరలు రాకపోవడంతో ఈ ఏడాది ఖరీఫ్‌ లో పల్నాడు జిల్లా రైతులు వరి సాగుకు అయిష్టత ప్రదర్శిస్తున్నారు. గతేడాది నీటి విడుదల ఆశాజనకంగా ఉన్నా గత ఖరీఫ్‌లో కేవలం లక్ష ఎకరాల్లోనే సాగుచేశారు. కనీసమద్ధతు ధరలుకూడా రాకపోవడం వల్ల రైతులు వరిసాగుకు ఆసక్తి చూపడం లేదు. వరి సాగులో ఎకరాకు రూ.40 వేల వరకు పెట్టుబడి పెట్టినా 40 బస్తాల వరకు దిగుబడి వస్తే తప్ప కనీసం పెట్టుబడి రాని పరిస్థితి నెలకొంది. దీంతో వరిసాగుకు పల్నాడు రైతుల్లో ఆసక్తి తగ్గింది.