ప్రజాశక్తి - అచ్చంపేట : రసం పీల్చే పురుగులు గమనించి నివారణ చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి ఐ.మురళి రైతులకు సూచించారు. మండలంలోని కోనూరులో పత్తి పొలాలను బుధవారం సందర్శించి, రైతులకు పలు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో పత్తిపైరులో రసం పీల్చు పురుగులైన తామర పురుగు, పేనుబంక, తెల్ల దోమ, పచ్చదోమల ఉధృతికి అవకాశం ఉందని చెప్పారు. తమ పరిశీలనలో రసం పీల్చే పురుగులను గమనించామన్నారు. ఈ పురుగులు ఆకుల నుండి రసం పీల్చడం వలన ఆకులు వెనకకు ముడుచుకుని పోవడం, ఎండిపోవడం వంటి లక్షణాలు పైరులో కనిపిస్తాయని తెలిఊఆర. నివారణ కోసం మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీ లీటర్లు , అసిఫేట్ 2 గ్రాములు లేదా అసెటమిప్రిడ్ 1 గ్రాము లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలని రైతులకు సూచించారు. అనంతరం ప్రభుత్వం నూరుశాతం రాయితీపై పంపిణీ చేసిన పొలం గట్లపై కంది సాగును పరిశీలించారు. గట్లపై కంది సాగు చేయాలని, విత్తనాల కోసం స్థానిక రైతు భరోసా కేంద్రంలో సంప్రదించాలని చెప్పారు. కార్యక్రమంలో స్థానిక సహాయ వ్యవసాయ సంచాలకులు వి.హనుమంతరావు, మండల వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు, గ్రామ వ్యవసాయ సహాయకులు షరీఫ్, రైతులు పాల్గొన్నారు.
ప్రతిఒక్కరూ మొక్కలు నాటండి
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని జిల్లా వ్యవసాయ అధికారి ఐ.మురళి కోరారు. మన ఊరు - మన దేశం కార్యక్రమంలో భాగంగా నేల తల్లికి వందనం వీరుల త్యాగాలకు వందనం అనే శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఆజాదీకా అమృత్ మహోత్సవంలో భాగంగా కోనూరులో 75 మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభించారు. అదేవిధంగా మండలంలోని ఏడు గ్రామాల్లో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఎంపిడిఒ శివ సుబ్రహ్మణ్యం నాగశ్రీనివాస్, వెంకటస్వామి పాల్గొన్నారు.










