ప్రజాశక్తి - చిలకలూరిపేట : పత్తిలో ఎకరాకు పది లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా గులాబి పురుగు ఉధృతిని తగ్గిచొచ్చని వ్యవసాయ శాఖ అడిషనరల్ డైరెక్టర్ విజయలక్ష్మి చెప్పారు. ఆత్మ-గుంటూరు ఆధ్వర్యంలో రైతు శిక్షణ శిబిరాన్ని మండలంలోని కావూరులో గురువారం నిర్వహించారు. కార్యక్రమానికి మండల వ్యవసాయా ధికారి శ్రీలత అధ్యక్షత వహించగా విజయలక్ష్మి మాట్లాడుతూ లింగాకర్షక బుట్టలను వాడే విధానాన్ని వివరించారు. జిల్లా వ్యవసాయ శాఖాధికారి మురళి, ఆత్మ పీడీ పి.రామాంజనేయులు మాట్లాడుతూ రైతులంతా సామూహికంగా బుట్టలను ఏర్పాటు చేసుకోవాలని, అప్పుడే మంచి ఫలితాలు ఉంటాయని చెప్పారు. జిల్లా వనరుల కేంద్రం డిడిఎఎం శివకుమారి, జిల్లా ఏరువాక శాస్త్రవేత్త జి.రమేష్ మాట్లాడుతూ పైరు వయస్సు 100 రోజులు దాటిన తర్వాత సింథటిక్ పైరుత్రాయిడ్స్ వాడొద్దని, సాధారణ మందులైన ప్రోపినోపాస్ వాడాలని, పైపాటుగా కాంప్లెక్స్ ఎరువులు వేసుకోవాలని సూచించారు. నరసరావుపేట ఎడిఎ పి.మస్తానమ్మ మాట్లాడుతూ పత్తిపంట వేయని రైతులు ప్రత్యామ్నా యంగా మినుము, కంది, పెసర సాగుచేసుకోవాలని చెప్పారు. ఈ సందర్భంగా రైతులకు ఎకరాకు పది చొప్పున లింగాకర్షక బుట్టలను పంపిణీ చేశారు.










