ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి: గుంటూరు, పల్నాడు జిల్లాల్లో ఖరీఫ్ సాగు మందగమనం కొనసాగుతోంది. ఈ ఏడాది అపరాల సాగు గణనీయంగా తగ్గనుంది. పల్నాడు జిల్లాలో 52 వేల ఎకరాల్లో అపరాలు సాగవుతాయని అంచనా వేయగా ఈ ఏడాది ఇప్పటి వరకు 3800 ఎకరాల్లోనే కంది, మినుము, పెసర, ఇతర పంటలను సాగుచేశారు. 50 వేల ఎకరాల్లో కంది సాగు జరుగుతుందని అంచనా వేయగా ఇప్పటి వరకు కేవలం 3500 ఎకరాల్లోనే కంది పంట వేశారు. పెసర 750 ఎకరాలకు గాను 120 ఎకరాలు, మినుము 3060 ఎకరాలకు గాను 118 ఎకరాలు సాగు అయింది. గుంటూరు జిల్లాలో మొత్తం 6500 ఎకరాలలో అపరాలు సాగు చేస్తారని అధికారులు అంచనా వేయగా ఇప్పటి వరకు 620 ఎకరాల్లోనే సాగు చేశారు. కంది 250 ఎకరాలకుగాను 100 ఎకరాలు, పెసర 320 ఎకరాలకు గాను కేవలం 20 ఎకరాలు, మినుము 6 వేల ఎకరాలకు గాను 500 ఎకరాల్లో సాగు చేశారు.
పల్నాడు జిల్లాలో పత్తి, గుంటూరు జిల్లాలో వరిసాగుపై రైతులు ఎక్కువగా దృష్టి సారించారు. గుంటూరు జిల్లాలో 3.25 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేస్తారని అంచనా వేయగా ఇప్పటి వరకు 1.50 లక్షల ఎకరాల్లో పత్తి, వరి, మొక్కజొన్న, పసుపు తదితర పంటలుసాగు చేశారు. పల్నాడు జిల్లాలో మొత్తం 5.12 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ పంటలు సాగవుతాయని అంచనా వేయగా ఇప్పటి వరకు కేవలం 3.10 లక్షల ఎకరాలలో పత్తి, ఇతర పంటలు సాగయ్యాయి. జిల్లాలో 1.40 లక్షల ఎకరాల్లో మిర్చిసాగు జరగాల్సి ఉండగా ఇప్పటివరకు కేవలం 10 వేల ఎకరాల్లోనేసాగు చేశారు. పల్నాడులో వరి నారుమళ్లుకూడా ఇంకా ప్రారంభం కాలేదు. గుంటూరు జిల్లాలో 1.66 లక్షల ఎకరాలకు గాను లక్ష ఎకరాల్లోవరి సాగు జరిగింది. పత్తి 76 వేల ఎకరాలకు గాను 42వేల ఎకరాలు, మిర్చి 40 వేల ఎకరాలకుగాను 4 వేల ఎకరాల్లో సాగు చేశారు.
పల్నాడు జిల్లాలో ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదు కాలేదు. పల్నాడు జిల్లాలో జూన్‌లో 80.9 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 81.3 మిల్లీమీటర్లు నమోదైంది. జులైలో 131 మిల్లీ మీటర్లకు గాను 106.9 మిల్లీ మీటర్లే నమోదైంది. ఆగస్టులో 139.8 మిల్లీ మీటర్లు నమోదు కావాల్సి ఉండగా ఇప్పటి వరకు 36.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. గుంటూరు జిల్లాలో జిల్లాలో జూన్‌లో 97.1 మిల్లీమీటర్లకు గాను 105.8మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. జులైలో 164.9 మిల్లీ మీటర్లకు గాను 255.2 మిల్లీ మీటర్లు నమోదు కాగా ఆగస్టులో 164.7 మిల్లీ మీటర్లకు గాను ఇప్పటివరకు 76.1 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. రెండ్రోజులుగా గుంటూరు, పల్నాడు జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. పల్నాడు జిల్లాలో 12 మండలాల్లో ఇప్పటికీ సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదు కావడంవల్ల మండలాల్లో పంటల సాగు ఇంకా ప్రారంభం కాలేదు.










