Nov 09,2023 00:46

వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడుతున్న గుంటూరు జిల్లా కలెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డి

ప్రజాశక్తి-గుంటూరు : సిసిఐ కేంద్రాల్లో మద్దతు ధరకు పత్తిని విక్రయించుకునేందుకు వీలుగా జిల్లాలో పత్తి సాగు చేసిన రైతులందరి వివరాలను ఆర్బీకే కేంద్రాల్లో నమోదు చేసేలా వ్యవసాయ సహాయకులను మండల, జిల్లా స్థాయి వ్యవసాయ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌ నుండి మండల స్థాయి అధికారులతో కలెక్టర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. పత్తి సాగు చేస్తున్న మండలాల్లోని ఆర్‌బికెల్లో ఈ-క్రాప్‌ వివరాల ఆధారంగా పత్తి సాగు చేసిన రైతులకు మద్దతు ధరకే సిసిఐ కేంద్రాల్లో పత్తిని విక్రయించుకునేలా పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల వల్ల రైతులకు ఎరువుల అవసరం ఉంటుందని, నిర్దేశించిన లక్ష్యాల మేరకు ఆర్బీకేల ద్వారా రైతులకు ఎరువులు అందుబాటులో ఉంచాలని చెప్పారు. పేదలందరికీ ఇళ్ల పథకం లే ఔట్లలో ఇళ్ల నిర్మాణాలను ప్రతివారం లక్ష్యాల మేరకు పూర్తయ్యేలా గృహ నిర్మాణ శాఖాధికారుతో పాటు మండల స్థాయి అధికారులు నిత్యం పర్యవేక్షించాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో తెనాలి సబ్‌ కలెక్టర్‌ గీతాంజలి శర్మ, జిల్లా వ్యవసాయ అధికారి ఎన్‌.వెంకటేశ్వర్లు, పంచాయతీ రాజ్‌ ఎస్‌ఇ బ్రహ్మయ్య, హౌసింగ్‌ పీడీ వేణుగోపాల్‌, జిల్లా అధికారులు పాల్గొన్నారు.