Jun 14,2023 21:38

హోళగుందలో పత్తిని వదిలేసిన రైతు

ప్రజాశక్తి - పెద్దకడబూరు
మండలంలోని మేకడోణ గ్రామంలో వైసిపి యువనేత, రైతు యోగేంద్ర గౌడ్‌ తన రెండెకరాల పత్తి పంటను బుధవారం మేకల మందకు వదిలేశారు. రైతు తొలకరి వర్షాలకే పత్తి విత్తనాలు నాటి కంటికి రెప్పల కాపాడుకున్నారు. సకాలంలో వర్షాలు కురవకపోవడంతో పత్తి పంట పసుపు పచ్చగా మారింది. పంటను మేకలకు వదిలేశారు. ఇప్పటికే ఎకరాకు రూ.25 వేలు పెట్టుబడి పెట్టి నష్టపోయినట్లు రైతు యోగేంద్ర గౌడ్‌ వాపోయారు. హోళగుంద మండలంలోని చిన్నహేటలో మాల ఎర్రప్ప ఏడెకరాల భూమిని రూ.లక్షకు కౌలుకు తీసుకున్నారు. 30 ప్యాకెట్లను రూ.1000 చొప్పున కొనుగోలు చేసి ముంగారు పత్తిని సాగు చేశారు. పొలంలో నాటి 40 రోజులపాటు భార్య, పిల్లలతో పొలం పని చేశారు. అలాగే ఎరువు, రసానిక మందులను పిచికారి చేశారు. 40 రోజులపాటు పంటను కాపాడుకున్నా ఫలితం లేకపోయింది. పత్తి పంటకు ఆకుముదురు, ఎర్ర రోగం తగిలి ఎదగలేదు. దిగుబడి రాకపోవడంతో బుధవారం గొర్రెలు, మేకలు, పశువులకు వదిలేశారు. పత్తి పంటను గొర్రెలు, మేకలు, పశువులను మేపుతూ రైతు ఎర్రప్ప బోరున విలపించారు. కలెక్టర్‌, జిల్లా వ్యవసాయ అధికారులు చర్యలు తీసుకుని పంట నష్టపరిహారం మంజూరు చేయాలని బాధిత రైతు ఎర్రప్ప కోరారు.