ప్రజాశక్తి- దేవనకొండ
గత ఖరీఫ్ సీజన్‌లో వర్షాభావ పరిస్థితుల వల్ల దిగుబడుల్లేక నష్టపోయిన పత్తి రైతులందరికీ బీమా పథకం వర్తింపజేయాలని సిపిఎం జిల్లా నాయకులు బి.వీరశేఖర్, మండల నాయకలు అశోక్ డిమాండ్ చేశారు. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పందికోన రిజర్వాయర్ నుంచి కుడి కాలువలకు నీరు వదలాలని కోరారు. సోమవారం సిపిఎం ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. సిపిఎం మండల నాయకులు యూసుఫ్ బాష అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల్లో పత్తి పంటకు బీమా వర్తింపజేసి కేవలం 5, 6 మండలాలకు పంటల బీమా వర్తింపజేయకపోవడం దుర్మార్గమన్నారు. మండలంలో పత్తి పంటను చాలా విస్తారంగా పండిస్తారని, పెట్టుబడులు కూడా భారీగా పెట్టారని తెలిపారు. గతేడాది వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో సరైన సమయంలో వర్షాలు కురవక పత్తి పంట తీవ్రంగా దెబ్బతిందని, దిగుబడి అరకొరగా వచ్చిందని పేర్కొన్నారు. పత్తి రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. పంటల బీమా పథకాన్ని అస్తవ్యస్తంగా, తప్పులతడకగా మార్చిందని తెలిపారు. దీనిని వెంటనే సరిచేసి రైతులకు న్యాయం చేయాలని, పత్తి రైతులకు ఎకరాకు రూ.15 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పందికోన రిజర్వాయర్‌లో నీళ్లు ఉన్నాయని, ఇప్పటికే ఎడమ కాలువకు నీరు వదులుతున్నారని, కుడికాలువకు కూడా నీరు వదలాలని కోరారు. తద్వారా కొంతమంది రైతులైన కరువు బారి నుంచి పంటలను కాపాడుకోవచ్చని పేర్కొన్నారు. వెంటనే నీరు వదిలి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సిపిఎం మండల నాయకులు పాండు, వెంకటేష్ ఆచారి, కార్యకర్తలు రంగడు, మహేష్, రంగస్వామి, రంగన్న, శాంతిరాజు, రామాంజనేయులు పాల్గొన్నారు.
తహశీల్దార్‌కు వినతిపత్రం అందిస్తున్న సిపిఎం నాయకులు










