
పత్తి కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
- జిల్లా మార్కెటింగ్ అధికారి రహిమాన్
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్
పత్తి కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని అగ్రిట్రేడ్, మార్కెటింగ్ అధికారి ఎస్.అబ్దుల్ రహిమాన్ సూచించారు. సోమవారం నంద్యాలలో వ్యవసాయ మార్కెటింగ్, సిసిఐ సంయుక్త ఆధ్వర్యంలో మురారి పవన్ ఆగ్రో టెక్ జిన్నింగు మిల్లు, మర్మ లక్ష్మీ నారాయణ కాటన్ ఇండిస్టీ, ఏఎన్‌సి ఆగ్రో మిల్లులలో పత్తి కొనుగోలు కేంద్రాలను మార్కెటింగ్ అధికారి రహిమాన్, వ్యవసాయ మార్కెట్ కమిటీ అసిస్టెంట్ సెక్రటరీ శేషి రెడ్డి, సిసిఐ ఇన్‌చార్జ్ దారప్ప, నిర్వాహకులు రమణ, వ్యవసాయ మార్కెట్ కమిటీ సూపర్ వైజర్ శ్రీనివాసులు ప్రారంభించారు. అనంతరం మార్కెటింగ్ అధికారి మాట్లాడుతూ రైతులు పత్తిని అమ్మకానికి తెచ్చుకొనే ముందుగానే ఆధార్ కార్డు జిరాక్స్, పట్టాదారు పాసు పుస్తకం తీసుకెళ్లి ఆర్‌బికెలో రిజిస్త్రేసన్ చేయించుకోవాలని సూచించారు. టోకెన్ పొందిన తర్వాత మాత్రమే రైతులు పత్తిని కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకురావాలన్నారు. తేమ 8 శాతం మాత్రమే ఉండాలని, ఎక్కువ ఉంటే ప్రతి ఒక్క శాతానికి 55.50 పైసల చొప్పున ధర తగ్గుతుందని, 12 శాతం కంటే తేమ ఉన్న పత్తిని సిసిఐ కొనుగోలు చేయదన్నారు. క్వింటాకు కనీస మద్దతు ధర పొడవు పింజ రకం కు రూ.7,020, పొట్టి పింజ రకం రూ.6,600లకు అమ్ముకోవచ్చనని తెలిపారు. మధ్యవర్తులు, దళారుల వద్దకు వెళ్లకుండా రైతులు పత్తిని కొనుగోలు కేంద్రంలో అమ్ముకోవాలని సూచించారు. కొనుగోలు కేంద్రాలుగా ఏర్పాటు చేసిన జిన్నింగు మిల్లులు, మార్కెట్ యార్డుల వద్దకు ఎవరైనా దళారులు, మధ్యవర్తులు వస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ సిబ్బంది పాల్గొన్నారు.