
ప్రజాశక్తి - పార్వతీపురం : పత్తి కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్లు జాయింట్ కలెక్టర్ అర్.గోవింద రావు తెలిపారు. పత్తి రైతు నష్టపోకుండా ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరకు విక్రయించేలా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. స్థానిక కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన పత్తి పంట కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం శనివారం జరిగింది. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మౌళిక సదుపాయాలు మేరకు కొన్ని ప్రాంతాల్లో పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. సాలూరు మార్కెట్ యార్డ్‌లోని ప్రస్తుతం జిన్నింగ్ మిల్‌లో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తున్నామన్నారు. నవంబర్ 1 నుంచి సమీపంలోని రైతు భరోసా కేంద్రాల్లో రైతులు వారి పేర్లను నమోదు చేయించుకోవాలన్నారు. జిల్లాలోని సుమారు 13,106 ఎకరాల్లో పత్తి పంట సాగు చేయగా ఎకరాకు ఆరు క్వింటాలు చొప్పున 78 వేల క్వింటాళ్ల దిగుబడి అంచనా వేస్తున్నట్లు వివరించారు. ప్రభుత్వం ప్రకటించిన నిబంధనల మేరకు క్వింటాకు కనీస మద్దతు ధర రూ.7020గా ఉందని, ఆ ధరకు కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. రైతుకు ప్రభుత్వం నిర్ణయించిన ధరకంటే అధిక ధర మార్కెట్ లో లభిస్తే విక్రయించుకోవచ్చని అన్నారు. మధ్యవర్తులు, దళారులను ఆశ్రయించి రైతు నష్టపోకుండా ఉండాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన ప్రదేశాలకు దళారులు, మధ్యవర్తులు వస్తే చట్టపరంగా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుపై రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఎటువంటి సందేహాలు ఉన్నా మొబైల్ నంబర్ 9182361390 కు సంప్రదించాలని కోరారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి కె. రాబర్ట్ పాల్, జిల్లా అగ్రి ట్రేడ్, మార్కెటింగ్ అధికారి ఎల్.అశోక్ కుమార్, జిల్లా అగ్నిమాపక అధికారి కె .శ్రీను బాబు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎం.శశికుమార్, సాలూరు, పాలకొండ ఎఎంసి సెక్రటరీలు బి.భారతి, జి.స్రవంత్, సిఐ సిహెచ్.స్వామినాయుడు, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారి కె.రవిప్రసాద్, జిన్నింగ్ మిల్లు యజమాని ఎస్.కన్నన్, సాలూరు ఎఎంసి సూపర్వైజర్ ఎమ్.శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.