Apr 23,2023 22:22

ప్రజాశక్తి - జంగారెడ్డిగూడెం
           మండలంలోని పట్టెన్నపాలెం బ్రిడ్జిని నిర్మించాలని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్‌ దాసరి శ్యామ్‌చంద్రశేషు అధికార వైసిపి ప్రజా ప్రతినిధులకు సెల్ఫీ ఛాలెంజ్‌ చేశారు. ఆదివారం మండలంలోని పట్టెన్నపాలెం జల్లేరుపై అసంపూర్తి నిర్మాణంలో ఉన్న వంతెనను వెంటనే నిర్మించాలని డిమాండ్‌ చేస్తూ సెల్ఫీ దిగి ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో టిడిపి ప్రభుత్వం పట్టెన్నపాలెం వంతెనకు నిధులు కేటాయించి పనులు ప్రారంభించిందని తెలిపారు. ఎన్నికల కోడ్‌ వల్ల నిలిచిన పనులు ప్రభుత్వం మారిన నేపథ్యంలో బ్రిడ్జికి ముసలంపట్టి నేటికీ పూర్తి కాలేదని ఏద్దేవ చేశారు. ఈ మార్గంలో నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయని, ఈ ప్రాంతంలో ప్రముఖ క్షేత్రం గుబ్బల మంగమ్మ తల్లి దేవాలయం ఉండడం వల్ల ఇతర రాష్ట్రాల నుంచి కూడా వేలాది మంది వాహనాల్లో ఆలయాన్ని దర్శించుకుంటారని తెలిపారు. అలాంటి ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తిచేయకపోవడం బాధాకరమన్నారు. టిడిపి సేల్ఫీ ఛాలెంజ్‌ని సవాలుగా తీసుకుని వంతెన నిర్మాణం పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.