తహశీల్దారుకు సిపిఎం వినతి
ప్రజాశక్తి-అచ్యుతాపురం
ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఓటర్ల జాబితాలోని అచ్యుతాపురం మండలానికి చెందిన ఓటర్లలో చోటుచేసుకున్న తప్పులను సరిచేయాలని కోరతూ బుధవారం తహశీల్దారు శ్రీనివాసరావుకు సిపిఎం నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కన్వీనర్ ఆర్.రాము మాట్లాడుతూ ఓటర్ల జాబితాలో జరిగిన తప్పులను తహశీల్దారు దృష్టికి తీసుకొచ్చినట్లు చెప్పారు. అచ్చుతాపురం మండలానికి సంబంధించిన ఓటర్ లిస్ట్ గందరగోళంగా ఉందన్నారు. మండలంలో 197, 198 పోలింగ్ బూతులను హైస్కూల్లో ఏర్పాటు చేశారని, ఆ రెండు బూతుల్లో ఒకే గ్రామానికి చెందిన ఓటర్లు ఉన్నారని తెలిపారు. ఎలమంచిలి, హరిపురం, మెలిపాక ఇతర మండలాల ఓట్లు అచ్చుతాపురం ఓటర్ల జాబితాలో చేర్చారని పేర్కొన్నారు. ఓటర్ల జాబితా సరిచేసి గ్రామాల వారీగా జాబితాలను పునరుద్ధరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కడారి అప్పారావు, కె.సోమునాయుడు తదితరులు పాల్గొన్నారు.










