Dec 09,2022 00:01

డిఆర్‌ఒకు వినతిపత్రం ఇస్తున్న సిపిఎం నాయకులు శంకరరావు, రాజు

ప్రజాశక్తి-అనకాపల్లి
ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ముసాయిదా ఓటర్ల జాబితాలో జరిగిన పొరపాట్లు, అనర్హుల పేర్లు తొలగించాలని సిపిఎం నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఆర్‌.శంకరరావు, అల్లు రాజు గురువారం డిఆర్‌ఒ వెంకటరమణకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముసాయిదా ఓటర్ల జాబితాలో నిరక్షరాసుల పేర్లు నమోదయ్యాయని తెలిపారు. జిల్లాలో 44 పోలింగ్‌ బూతులు ఏర్పాటు చేయగా, అన్నింటిలోనూ ఎన్నికల నిబంధనల మేరకు పుట్టిన తేదీ, విద్యార్హతలు స్పష్టం లేవని పేర్కొన్నారు. సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఇలా జరిగిందన్నారు. వి.మాడుగుల పోలింగ్‌ బూత్‌ నెంబర్‌ 160లో ఓటర్ల జాబితా సీరియల్‌ నెంబర్‌ 501, 516, 716, 720, 722 పదో తరగతి విద్యార్హతతో నమోదైన విషయాన్ని ఈ సందర్భంగా ఉదహరించారు. ఎస్‌.రాయవరం 188 పోలింగ్‌ బూత్‌, మాకవరపాలెం 180 పోలింగ్‌ బూత్‌, కోటవురట్ల 179 పోలింగ్‌ బూత్‌ ఇలా అనేక పోలింగ్‌ బూత్‌లో పొరపాట్లు జరిగాయని తెలిపారు. అలాగే ఒకే వ్యక్తికి రెండు నుంచి ఐదు ఓట్లు కలిగిన వారు అత్యధికంగా ఉన్నారన్నారు. ఇదిలా ఉండగా అర్హత ఉండి గెజిటెడ్‌ సంతకంతో ఆఫ్‌ లైన్‌ దరఖాస్తు చేసుకున్న వారినీ ఓటర్లుగా నమోదు చేయలేదన్నారు. ఆన్లైన్లో నమోదు అయిన దరఖాస్తులను బిఎల్వోలు సక్రమంగా పరిశీలించని కారణంగా ఇటువంటి పొరపాట్లు జరిగాయని పేర్కొన్నారు. ఈ అంశాలపై సమగ్ర విచారణ జరిపి పొరపాట్లు సరిచేయాలని, అలాగే అనర్హుల పేర్లను తొలగించి అర్హుల పేర్లు నమోదు చేయాలని కోరారు.