ప్రజాశక్తి -అనంతగిరి
విశాఖ -కిరండూల్ కేకే లైన్ మార్గంలో శివలింగపురం వద్ద కిరండూల్ పాసింజర్ పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ప్రయాణికులకు ఎటువంటి ప్రాణాపాయం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మంగళవారం తెల్లవారుజామున విశాఖలో బయలుదేరిన పాసింజర్ రైలు ఉదయం 9:30 గంటల సమయంలో శివలింగపురం స్టేషన్ సమీపంలో గల టన్నల్ 45/3 టు 45/7 సమీపంలో ఒక బోగీ పట్టాలు తప్పింది. ఈ విషయాన్ని గమనించిన కో-పైలట్ చాకచక్యంగా వ్యవహరిస్తూ రైలును కంట్రోల్ చేయడంతో సుమారు 15 బోగీలతో కూడిన పాసింజర్ ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. పట్టాలు తప్పుతున్న ఆందోళనలో ఆ బోగీలో ఉన్న ప్రయాణికులు ఎమర్జెన్సీ కిటికీల ద్వారా కొందరు కిందకు గెంతేశారు. ఎవరికీ ఎటువంటి ప్రమాదమూ జరగలేదు.
రైలు బోగీ పట్టాలు తప్పిన విషయాన్ని స్థానిక రైల్వే అధికారులు విశాఖలోని కార్యా లయానికి సమాచారం అందించారు. వెంటనే స్పందించిన డిఆర్‌ఎం అనుప్ సత్పతి మెడికల్, మరమ్మతులు చేపట్టే బృందంతో కలిసి యాక్సిడెంట్ రిలీఫ్ మెడికల్ ట్రైన్‌లో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తప్పిన బోగీని క్రేన్ సహాయంతో పట్టాలులెక్కించారు. రైల్వే శాఖ అధికారులు యుద్ధ ప్రతిపాదికన పనులను చేపట్టి ఇటు పాసింజర్ రైలు, అటు గూడ్స్ రైలు మార్గాలను కొనసాగించేందుకు పనులను పూర్తిచేశారు. అక్కడి నుంచి 11.05 గంటలకు రైలు బయలుదేరింది. పట్టాలు తప్పిన ఈ బోగీలో సుమారు 50 మంది ప్రయాణికులు ఉన్నారని, ఎటువంటి ప్రమాదమూ జరగలేదని రైల్వే అధికారులు తెలిపారు. మార్గమధ్యలో పాసింజర్ రైలు నిలిచిపోవడంతో వేలాది మంది ప్రయాణికులు గంటల సమయం తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.










