ప్రజాశక్తి-వేటపాలెం: స్థానిక రైల్వే స్టేషన్ వద్ద లూప్‌లైన్‌లో గూడ్స్ రైలు బుధవారం పట్టాలు తప్పింది. విజయవాడ నుండి గూడూరు వైపు మూడో ట్రాక్‌కు సంబందించిన పట్టాలు, సిమెంట్ దిమ్మలు తరలించడానికి మంగళవారం రాత్రి బాపట్ల నుండి బయలుదేరి వేటపాలెం ట్రాక్ రిపేరులో ఉండడంతో లూప్‌లైన్‌లోనే గూడ్స్‌ను ఉంచారు. మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో గూడ్స్‌ను లైను నుండి మెయిన్ ట్రాక్ ఎక్కించే సమయంలో రెండు బోగీలు పట్టాల నుండి కిందకు దిగాయి. వెంటనే అప్రమత్తమైన ఫైలెట్ రైలును ఆపివేశారు. సమాచారం అందుకొన్న రైల్వే ఆఫీసర్స్, పోలీసు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొన్నారు .రైల్వే అధికారులు, సాంకేతిక సిబ్బంది బోగీలను పట్టాలు ఎక్కించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈ ఘటనతో కొన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్ళు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈ ఘటనపై రైల్వే అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. పట్టాలు తప్పిన ప్రాంతంలో అంటే లూప్‌లైన్ ప్రాంతంలో ఎలాంటి పనులు జరగకపోయినా పట్టాలు తప్పడంలో గల ఆంతర్యం అంతుపట్టలేదు.
గత సంవత్సరం ఏప్రియల్ 18 తేదిన ఇదే ప్రాంతంలో విజయవాడ నుండి చెన్నై వెళ్ళె గూడ్స్ పట్టాలు తప్పింది. ఇటీవల స్టేషన్‌కు కూతవేటు దూరంలో కరెంట్ వైరు తెగి పట్టాలపై పడింది. అర్దరాత్రి సమయం కావడం వలన ఏలాంటి ప్రాణనష్టం జరగలేదు. వేటపాలెం రైల్వే స్టేషన్ వద్ద తరచూ ప్రమాదాలు సంబవించడం పట్ల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా సంబందిత ఉన్నతాధికారులు నిర్వహణ ప్రక్రియను సమర్దవంతంగా చేపట్టెందుకు శాఖపరమైన కఠినచర్యలతో పాటు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
విలేకరిపై రైల్వే సిబ్బంది దౌర్జన్యం
పట్టాలు తప్పిన గూడ్స్ రైలును ఫొటోలు తీస్తున్న ఓ పత్రిక (ప్రజాశక్తి కాదు) విలేకరిని రైల్వే సిబ్బంది దుర్భాషలాడారు. ఫొటోలు తీయడానికి వీల్లేదు అంటూ చేతిలోని సెల్‌ఫోనును లాక్కోన్నారు. దీంతో ఆ విలేకరి రైల్వే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.










