ప్రజాశక్తి - కడియం రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ జరగని రీతిలో పాలన సాగుతుందని, జగనన్న కాలనీల పేరుతో కొత్త కొత్త గ్రామాలనే సృష్టిస్తున్నామని పాలకులు గొప్పలు చెప్పుకుంటున్నారు. ఎంతో ఆర్భాటంగా నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు' పేరుతో పెద్దఎత్తున ప్రజాధనంతో అధిక ధరలకు భూముల కొనుగోలు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. లబ్ధిదారులను ఎంపిక చేసి పట్టాలు పంపిణీ చేశారు. తీరా నాడు పట్టాలు ఇచ్చిన ప్రభుత్వం నేటికీ కొన్ని ప్రాంతాల్లో స్థలాలు చూపించిన దాఖలాలు కన్పించడం లేదు. చేతిలో పట్టాలు ఉన్నా స్థలాలు ఎక్కడున్నాయో తెలియక లబ్ధిదారులు నేడు లబోదిబోమంటున్నారు.
కడియం మండలంలోని జేగురుపాడులో 48.05 ఎకరాల్లో వేసిన జగనన్న లే అవుట్‌లో 2020 మంది లబ్దిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. ఇక్కడ వందల సంఖ్యలో నిర్మాణాలు పూర్తయి, అధిక శాతం గృహాలు వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయి. అలాగే వేమగిరిలో లే అవుట్-1 లో 100 మంది లబ్దిదారులకు, లే అవుట్-2 లో 585 మంది లబ్దిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. ఇక్కడ కూడా కొంతశాతం నిర్మాణాలు పూర్తికాగా, అధికశాతం నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఇక అసలు విషయానికి వస్తే వేమగిరి లే అవుట్- 3 పేరిట సర్వే నెం. 204లో 19.13 ఎకరాల్లో 827 మంది లబ్దిదారులకు పైన ఉదహరించిన వారితోపాటుగానే పట్టాలు పంపిణీ చేశారు. ఇందులో మండలంలోని కడియపుసావరం గ్రామానికి చెందిన 121 మంది లబ్ధిదారులు కాగా, 706 మంది లబ్ధిదారులు వేమగిరి గ్రామానికి చెందిన వారు ఉన్నారు. వేమగిరిలోని ప్రభుత్వ భూమిని జగనన్న లే అవుట్- 3గా పేదలకు కేటాయించినా కాంట్రాక్టర్ తప్పిదం వల్ల లబ్దిదారులకు స్థలాలు పంపిణీలో తీవ్ర జాప్యం జరిగిందంటూ అధికారులు, ప్రజాప్రతినిధులు తరచూ చెబుతున్న మాటలు. అప్పట్లోనే లే అవుట్‌ను చదును పేరిట కాంట్రాక్టర్ లోతుగా తవ్వకాలు కొనసాగించి గ్రావెల్ బయటకు తీసుకుపోవడంతో లే అవుట్‌లో కొంతభాగం చెరువులుగా మారిపోయింది. దీనిపై ప్రతిపక్షాలు ప్రభుత్వ తీరును ఎండగట్టారు. లే అవుట్లో పెట్టిన గోతుల్లో నావలపై విహరయాత్ర చేస్తే, మరో పార్టీ ఆ గోతుల్లో చేప పిల్లల పెంపకం కార్యక్రమాన్ని చేపట్టి నిరసన వ్యక్తం చేశాయి. ప్రతిపక్షాల నిరసనలతో అధికార పార్టీకి చెందిన నాయకులు, అధికారులు స్పందించి గోతులతో ఉన్న లే అవుట్‌ను చదును చేసి నివాసయోగ్యంగా తీర్చిదిద్దారు. అక్రమంగా తవ్వకాలు కొనసాగిం చిన కాంట్రాక్టర్‌పై చర్యలు చేపట్టి, సొమ్ములు రికవరీ చేసి లే అవుట్‌ను చదును చేశారా? లేక ప్రభుత్వ సొమ్ములతో చదును చేశారా? అన్నది నేటికీ ప్రశ్నార్ధకంగానే ఉంది. ఈ నేపథ్యంలోనే గోతులతో ఉన్న లే అవుట్‌ను చదును చేయడంతో లబ్ధిదారుల్లో ఆశలు చిగురించాయి. లబ్ధిదారుల్లో ఆశలు చిగురించి నెలల తరబడి అవుతున్నా అధికారులు మాత్రం అదిగో పౌర్ణమి, ఇదిగో అమావాస్య అంటూ కాలాన్ని గడిపేస్తున్నారనే విమర్శలు లబ్ధిదారుల నుంచి వ్యక్తం అవుతున్నాయి. స్థలాల పంపిణీకి లే అవుట్ సిద్ధమైన లబ్ధిదారులకు ఆ స్థలాన్ని ఎప్పుడు కేటాయంపులు చేస్తారు? గృహా నిర్మాణాలకు ఎప్పుడు అనుమతి ఇస్తారు? అనే ప్రశ్నలకు జవాబు లభించడం లేదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రయివేటు పరిశ్రమకు కేటాయిస్తారా?
జగనన్న కాలనీ కోసం ప్రజాధనంతో కొనుగోలు చేసిన స్థలాన్ని ప్రయివేటు పరిశ్రమకు కేటాయింపు చేసేందుకే లబ్ధిదారులకు స్థలాలను చూపించడం లేదనే ప్రచారం మండలంలో కొనసాగుతోంది. ప్రస్తుతం లబ్ధిదారులకు ఇవ్వకుండా నిలుపుదల చేసిన స్థలం జాతీయ రహదారికి సమీపంలో ఉండటంతో ఆ స్థలంపై ఒక ప్రయివేటు పరిశ్రమకు చెందిన యాజమాన్యం కన్నుపడింది. ఇప్పటికే ఆ స్థలాన్ని తమ పరిశ్రమకు అప్పగించాలని జిల్లా అధికార యంత్రాంగం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. అయితే ఆ స్థలం ఇవ్వాలంటే మండలంలో 20 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసి ఇవ్వాలనే ప్రతిపాదనను ఆ యాజమాన్యం ముందు ఉంచినట్లు సమాచారం. దీనిపై ప్రస్తుతం అధికార యంత్రాంగం, సంబంధిత పరిశ్రమ యాజమాన్యం మధ్య చర్చలు సాగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
రాజవోలు రోడ్డులో ప్రత్యామ్నాయ స్థలం..!
వేమగిరి-3లోని లే అవుట్‌లోని 827 మంది లబ్ధిదారులకు వేరే ప్రాంతంలో స్థలాలను ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. కడియం రైల్వే స్టేషన్ సమీపంలోని రాజవోలు వెళ్లే రోడ్డులో మాధవరాయుడుపాలెం పంచాయితీ పరిధిలో అసైన్డ్‌ల్యాండ్‌ను సేకరించే పనిలో అధికార యంత్రాంగం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. గతంలో ఆ స్థలాన్ని మాజీ సైనికులకు పంపిణీ చేశారు. ప్రస్తుతం ఆ స్థలాన్ని తిరిగి వారి నుంచి సేకరించి వేమగిరి, కడియపు సావరం లబ్ధిదారులను అక్కడకు తెరలిస్తారనే వాదన లేకపోలేదు. ప్రస్తుతం మండలంలో జరుగుతున్న ఈ ప్రచారంతో లబ్ధిదారులు తీవ్ర ఆందోళనకు గురౌవుతున్నారు.
స్థలాలు చూపించాలి
మాకు పట్టాలిచ్చి సంవత్స రాలు గడుస్తున్నా ఇప్పటివరకూ స్థలాలు చూపించలేదు. గతంలో చెరువులన్నారు ఇప్పుడు చదును చేశారు. మరికొందరు ఈ స్థలాలను ఏదో పరిశ్రమకు ఇచ్చేస్తారట అని చెబుతున్నారు. తమకు మరోచోట ఇస్తారని అంటున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి మాకు స్థలాలు అప్పగించి, హొగృహాలు నిర్మించుకునేందుకు త్వరితగతిన చర్యలు తీసుకోవాలి.హొ
-వాసంశెట్టి దుర్గ ,లబ్ధిదారు - కడియపుసావరం.
లబ్ధిదారులకు స్థలాలను ఇస్తాం
నేను విధుల్లో చేరే నాటికే వేమగిరి లే అవుట్-3లో సమస్య ఉంది. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాము. ఉన్నతాధికారులు స్పందించి లే అవుట్‌ను చదును చేస్తున్నాం. వీలైనంత త్వరలో లెవెలింగ్ పనులు పూర్తిచేసి డి మార్కేషన్ చేయించి లబ్దిదారులకు స్థలాలు అందిస్తాం.
ఎం.సుజాత, తహశీల్ధార్, కడియం.










