Jan 30,2023 23:20

ఇళ్ల పట్టాలు చూపుతున్న గిరిజనులు. సిపిఎం నేతలు

ప్రజాశక్తి - అరకులోయ రూరల్‌ : జగనన్న గృహనిర్మాణ పథకం కింద పలువురు లబ్ధిదారులకు ప్రభుత్వపరంగా పట్టాలు ఇచ్చినా, ఇళ్లను ఎపుడు నిర్మించి ఇస్తారని సిపిఎం మండల కార్యదర్శి కిండంగి రామారావు ప్రశ్నించారు. సోమవారం అరకువేలి మండలం బస్కి పంచాయతీ కంజరితోట, కొంత్రాయిగూడ గ్రామాల్లో సిపిఎం బృందం పర్యటించి, ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయా గ్రామాల్లో తాగునీరు, సిసి రోడ్లు, మురుగుకాలువలు, ఇళ్ల నిర్మాణాలు వంటి పలు సమస్యలను స్థానికులు సిపిఎం బృందం దృష్టికి తెచ్చారు.
ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి కె రామారావు మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తామన్న హామీ మూడున్నరేళ్లు దాటినా నేటికీ అమలు నోచుకోవడం లేదన్నారు. ఇళ్లస్థలాలు, పట్టాలతో హడావిడి చేస్తున్నారే తప్ప, త్వరితగతిన ఇళ్ల నిర్మాణంపై అటు ప్రభుత్వంగానీ, ఇటు అధికారులుగానీ చిత్తశుద్ధితో కృషి చేయడం లేదన్నారు. ఇళ్ల పట్టాలు ఇచ్చి చేతులు దులుపుకుంటే, సొంతింటి నిర్మాణాలు ఎప్పటికి పూర్తవుతాయని ప్రశ్నించారు.
కొంత్రాయిగూడ, కంజరీతోట గ్రామాల్లో ప్రజలు దాహార్తితో అల్లాడిపోతున్నారని, సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడంతో అత్యవసర వైద్యానికి డోలిమోతలే శరణ్యమౌతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పోడు భూములకు పట్టాలు మంజూరు చేయాలని గతంలో దరఖాస్తు చేసినప్పటికీ, నేటికీ అనేక మంది అర్హులైన వారికి భూయాజమాన్య హక్కు పట్టాలు అందలేదన్నారు. అధిక కరెంటు బిల్లులు, ఇతరత్రా సాంకేతిక కారణాలు చూపుతూ ఎందరో పేదల పింఛన్లను ప్రభుత్వం రద్దుచేయడం దారుణమని, తొలగించిన పింఛన్లను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సింహాద్రి, గాంధీ, రాంబాబు, సమర్డి బాబురావు, కన్నయ్య, రామచందర్‌, సీతారాం, నవీన్‌, సోములు, అప్పలరాజు పాల్గొన్నారు.