
ప్రజాశక్తి- బొబ్బిలి
గొల్లపల్లి శ్రీదాడితల్లి కాలనీలో దాడితల్లి కళ్యాణ మండపం కోసం ఉంచిన రిజర్వ్ స్థలంలో ఇచ్చిన పొజిషన్ పట్టాలను రద్దు చేయాలని కోరుతూ గ్రామస్తులు శనివారం ఆందోళన చేశారు. దాడితల్లి కాలనీలో కళ్యాణ మండపం కోసం ఉంచిన రిజర్వ్ స్థలాన్ని కాపాడాలని కోరుతూ శనివారం కళ్యాణ మండపం స్థలం నుంచి దాడితల్లి ఆలయం వరకు ర్యాలీ చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ కాకల గోవిందమ్మ, మాజీ కౌన్సిలర్ కాకల వెంకటరావు, గ్రామ పెద్ద పి.ఈశ్వరరావు మాట్లాడుతూ దాడితల్లి కాలనీలో కళ్యాణ మండపం కోసం రిజర్వ్ స్థలం కేటాయిస్తే ఆస్థలంలో పొజిషన్‌లో లేనప్పటికీ రాజకీయ ఒత్తిడితో పొజిషన్ పట్టాలు ఇస్తున్నారన్నారు. కళ్యాణ మండపం స్థలంలో ఇచ్చిన పొజిషన్ పట్టాలు రద్దు చేయాలని, ఇక నుంచి పొజిషన్, ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కాలనీ ప్రజలు పాల్గొన్నారు.