ప్రజాశక్తి - భట్టిప్రోలు
పేదలకు పక్కా ఇళ్లు నిర్మించేందుకూ ఊళ్లే కడుతున్నామంటూ జగనన్న ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుంది. అయితే పేదలకు కేటాయించిన నివేశన స్థలాలలో సాంకేతిక లోపాలు నెలకొన్నాయి. ప్రతి ఏటా అర్హులైన లబ్ధిదారులకు నివేశన స్థలాలు కేటాయిస్తామని ప్రభుత్వం చెప్పి నాలుగేళ్లు గడిచింది. తొలి విడతలో పట్టాలు ఇచ్చారు. రెండో విడతలో అర్హులైన లబ్ధిదారులను గుర్తించారు. వారికీ నివేశన స్థలాల పట్టాలను ఇచ్చారే తప్ప స్థలం చూపలేదు. గడప గడపకు ప్రభుత్వ కార్యక్రమంలో మాత్రం లబ్ది దారులు పొందిన ప్రయోజనాల్లో ఇళ్ల స్థలానికి సంబంధించిన అమౌంట్‌ను చూపిస్తున్నారు. స్థలం కేటాయించినట్లుగా ఆధార్ కార్డు కూడా లింకు చేసి ఉండటంతో భవిష్యత్తులో స్థలం కోసం దరకాస్తు చేసుకునేందుకు వీలు లేకుండా పోయింది. ఇచ్చిన పట్టాకు స్థలం చూపకుండా కొత్తగా స్థలం అడిగే అవకాశం లేకుండా చేశారని లబ్దిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వివాదాస్పద స్థలంలో పట్టా ఇవ్వడమే....
వివాదా స్పదమైన స్థలం అని తెలిసి కూడా అధికారులు స్థలాన్ని కొనుగోలు చేసి పేదలుకు అంటగట్టారని బట్టిప్రోలు గ్రామ లబ్దిదారులు ఆరోపిస్తున్నారు. గ్రామంలో రెండు ఎకరాల భూమిలో 107మంది నిరుపేద ఓసి లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. ఆ భూమిని అప్పటికే కౌలుకు సాగు చేస్తున్న రైతు తనకు కౌలు అగ్రిమెంట్ ద్వారా నమోదయి ఉందని కౌలు దారుడు అధికారులకు సూచించారు. భూ యజమాని నుండి ఆ భూమిని కొనుగోలుకు చేసుకోవడానికి మాట్లాడుకుని కొంత సొమ్మును అడ్వాన్స్ గా కూడా చెల్లించానని, తన సమస్య పరిష్కరించి పేదల కోసం కొనుగోలు చేయాలని కౌలు దారుడు అధికారులకు విన్నవించాడు. అయినప్పటికీ రెవిన్యూ అధికారులు పట్టించుకోలేదు. భూ యజమాని వద్ద ఉన్న పాస్ పుస్తకం, అడంగల్ ఆధారంగా భూ యజమాని బ్యాంకు కాతాలో ప్రభుత్వ సొమ్మును జమ చేశారు. విషయం తెలుసుకున్న కౌలుదారుడు తన వద్ద ఉన్న ఆధారాలతో కోర్టును ఆశ్రయించాడు. దీంతో ఆ రెండు ఎకరాల భూమి కోర్టు పరిధిలోకి వెళ్లింది. పట్టాల పొందిన లబ్ధిదారులు గృహాలు నిర్మించుకునే పరిస్థితి లేకుండా పోయింది. ప్రభుత్వ స్థలాలు కేటాయించి మూడేళ్లు గడిచింది. నేటికీ కోర్టు సమస్య తీరకపోవడంతో పట్టాలు పొందిన లబ్ధిదారులు ఆందోళనకు గురవుతున్నారు. లబ్ధిదారులు స్థల వ్యవహారంపై అధికారులు, ప్రజా ప్రతినిధులను అడిగితే కోర్టులో తేలుతుందని దాటవేస్తున్నారని లబ్దిదారులు వాపోతున్నారు. కోర్టులో పరిష్కారం కాకుంటే ప్రత్యామ్నయం చూపుతారా? లేదా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై తాహశీల్దారు వెంకటేశ్వర మాట్లాడుతూ కోర్టు పరిధిలో ఉన్నందున తామేమి చేయలేమన్నారు. త్వరలో పరిష్కారం కావచ్చునని ఆశ భావన వ్యక్తం చేశారు.










