
అప్పటివరకూ సాఫీగా సాగుతున్న వారి ప్రయాణంలో రైలు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. బతుకు తెరువుకు పట్నం వెళ్లి పనులు చేసుకునే కూలీలు, తమ బంధువుల ఇళ్లకు, స్వగ్రామాలకు వెళ్తున్న పేదలు మృత్యువాత పడ్డారు. మరికొద్ది సేపట్లో ఇళ్లకు చేరుతామను కున్న వారి బతుకులు పట్టాల మధ్య నలిగి పోవంతో విషాదం నెలకొంది. కుటుంబీకులు, బంధువుల రోధనలతో జిల్లా కేంద్రాస్పత్రి
ప్రాంతం హృదయ విదారకరంగా
మారింది.
రైల్వే జిఎం ఆధ్వర్యాన ట్రాక్ పునరుద్ధరణ
కొత్తవలస : రైల్వే జిఎం మనోజ్ శర్మ, వాల్తేరు డిఆర్‌ఎం సౌరబ్ ప్రసాద్ నేతృత్వంలో ఆదివారం రాత్రి నుంచి సిబ్బంది హుటాహుటిన దెబ్బతిన్న బోగీలను తొలగింపు చర్యలు చేపట్టారు. ఇప్పటికే ఈ లైన్ మీదుగా ప్రయాణించే పలు రైళ్లను దారిమల్లించడంతో పాటూ వివిధ రైళ్ల రాకపోకలను రద్దుచేస్తూ రైల్వే శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపధ్యంలో ట్రాక్ పునరుద్ధరణ పనులను భారీ క్రైన్ల సహకారంతో ముమ్మరం చేశారు. సోమవారం మధ్యాహ్నం నాటికి ట్రాక్ పై శిధిలాలను పూర్తిగా తొలగించి, రెండు ట్రాక్‌లను పునరుద్దరించారు. దీంతో సాయంత్రం నుంచి పలు రైళ్లు ఆలస్యంగా నడిచాయి.
బాధితులకు ఆదుకుంటాం : బూడి
ఘటనా స్థలంలో సహాయక చర్యలను డిప్యూటీ సిఎం మంత్రి బూడి ముత్యాలు నాయుడు పరిశీలించారు. ప్రమాద బాధితులకు ప్రభుత్వం ఆదుకుంటుందని హామి ఇచ్చారు. ముఖ్య మంత్రి ఆదేశాలతో హుటాహుటిన సహాయక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఆయన వెంట స్థానిక ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు ఉన్నారు.
ప్రజాశక్తి - జామి
రెండు రైళ్లు ఢకొీన్న ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 13కు చేరింది. 40 మంది వరకు గాయపడినట్లు అధికారులు లెక్కలు తేల్చారు. మృతుల్లో ఎక్కువ మంది కూలి పనులు చేసుకొని జీవనం సాగించేవారే కావడంతో ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం అలముకుంది. మృతుల్లో ఏడుగురు విజయనగరం జిల్లా వారు కాగా, ముగ్గురు శ్రీకాకుళం, ఇద్దరు విశాఖకు చెందిన వారు ఇద్దరు, కర్నూలుకు చెందిన వారు ఒకరు ఉన్నారు. జిల్లాకు చెందిన మృతుల్లో గరివిడి మండలం కాంపు శంబాం, గదబవలసకు చెందిన ఇద్దరు, శ్రీకాకుళం జిల్లా జి.సింగడాంకు చెందిన ఇద్దరు ఉండడంతో ఆయా మండలాల్లో విషాదఛాయలు నెలకొన్నాయి. రాయగడ పాసింజర్ రైలు డ్రైవర్, లోకోపైలట్, పలాస రైలుగార్డు మృతి చెందడంతో రైల్వే ఉద్యోగుల్లో సైతం విషాదం అలముకుంది. గార్డు ఎం. శ్రీనివాసరావుది మన్యం జిల్లా. విజయనగరానికి చెందిన సతీష్ మృతుల్లో ఉన్నారు. సతీష్‌కు ఇటీవల వివాహం కావడంతో ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
కంటకాపల్లి-అలమండ మధ్య రైల్వేట్రాక్‌పై ఆగి ఉన్న విశాఖ-పలాస పాసింజర్ రైలును, ఆ వెనుక వస్తున్న విశాఖ-రాయగడ పాసింజర్ రైలు ఢకొీన్న విషయం తెలిసిందే. పట్టాలు తప్పిన వీటి బోగీలు పక్క ట్రాక్‌పై ఉన్న గూడ్సురైలు బోగీలపైకి దూసుకెళ్లడంతో పట్టాలు పైకి లేచాయి. ఈ ప్రమాదంలో ఆదివారం రాత్రి 10 మంది మృతదేహాలను బయటకు తీసిన సహాయక బృందాలు... సోమవారం ఛిద్రమైన రైలు భోగీలను కట్ చేసి రాయగడ పాసింజర్ రైలు లోకో పైలట్ మృతదేహంతో పాటు మరో ఇద్దరి మృతదేహాలకు వెలికితీశాయి. రైలు ప్రమాదంలో మృత్యువాత పడ్డవారిలో, క్షతగాత్రులైన వారిలో కూలి పనులు చేసుకునే వారే ఎక్కువ. ప్రమాదం జరిగిన సమయంలో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పరుగున వెళ్లి సహాయక చర్యలు చేపట్టడంతో కొంత వరకు ప్రాణ నష్టాన్ని తగ్గించారని బాధితులు చెబుతున్నారు.
క్షతగాత్రులకు ముఖ్యమంత్రి పరామర్శ
ప్రజాశక్తి-విజయనగరంటౌన్, కోట
రైలు ప్రమాదంలో గాయపడి జిల్లా కేంద్రాస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, మంత్రులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాధ్ సోమవారం పరామర్శించారు. బాధితులకు, వారి కుటుంబాలకు అండగా నిలుస్తామని ఈ సందర్భంగా సిఎం హామీ ఇచ్చారు. ఆసుపత్రి వార్డుల్లో ఉన్న మొత్తం 29 మంది క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, ప్రతీ ఒక్కరి వద్దకూ వెళ్లి పరామర్శించారు. రైలు ప్రమాదం జరిగిన తీరు, వైద్య సదుపాయంపై ఆరా తీశారు. వారిని ఓదార్చారు. అనంతరం మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి దైర్యంగా ఉండాలని, అన్నివిధాలా ఆదుకుంటామని తెలిపారు. ప్రమాదం జరిగిన తీరును, తీసుకున్న సహాయ చర్యలను మంత్రి బొత్స సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, రైల్వే ఉన్నతాధికారులు సిఎంకు వివరించారు.
కంటకాపల్లి సమీపంలో జరిగిన రైలు ప్రమాదంలో గాయపడిన వారిలో 29 మంది జిల్లా కేంద్ర సర్వజన ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. క్షతగాత్రుల వివరాలకు వారి కుటుంబ సభ్యులకు తెలియక కొందరు ఇబ్బందులు పడుతుంట.. సమాచారం తెలిసిన వారు ఆస్పత్రికి చేరుకొని సపర్యలు చేస్తున్న వారు కొందరు. మరోవైపు మృతదేహాలకు ఆస్పత్రి మార్చురీకి చేరుకోవడంతో ఆ ప్రాంతం ఆర్తనాదాలతో మార్మోగి పోయింది. మరోవైపు పరామర్శకు వస్తున్న అధికారులకు, పలు పార్టీల నాయకులకు అంతే ఆవేదనతో బాధితులు జరిగిన సంఘటనను వివరించడం తో వారి హృదయాలు బరువెక్కాయి.
- ప్రజాశక్తి, విజయనగరంకోట, టౌన్
పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట మండలంలోని పెదవంగర గ్రామానికి చెందిన సవర బుజ్జి (16) తలకు తీవ్ర గాయమై ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఉపాధి కోసం కర్నాటకలో పనిచేస్తున్న ఆమె.. అధోనిలో పనిచేస్తున్న తన అన్న రాయ్యప్పతో కలిసి స్వగ్రామం వస్తోంది. ఇంతలో ప్రమాదం జరగడంతో ఇద్దరూ గాయపడ్డారు. ఆమె అన్నయ్యను విశాఖ కెజిహెచ్‌కు తరలించగా, బుజ్జిని విజయనగరం తరలించారు. ఆమె సమాచారం కుటుంబ సభ్యులకు తెలియక పోవడం, ఆమె చెప్పిన ఫోన్ నెంబరు పనిచేయకపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఆస్పత్రిలో ధీనంగా తమ వారి కోసం ఎదురుచూస్తున్న ఘటన అందరినీ కలచివేసింది. విషయం తెలుసుకున్న ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ నాయకులు ఆమె కుటుంబీలకు సమాచారం ఇవ్వడంతో సాయంత్రం వారు ఆస్పత్రికి చేరుకున్నారు.
చిత్రంలో కనిపిస్తున్న ఈ పాప పేరు మహంతి తేజ(8). జి.సిగడాంకు చెందిన ఈ పాప చుట్టాలింటికి పెదనాన్నతో కలిసి వెళ్లింది. తిరిగి ప్రయాణంలో వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రెండు కాళ్లకు దెబ్బ తగిలి రక్తం కారుతున్నా భయపడకుండా పక్కనే ఉన్న వారి సెల్ తీసుకుని తన తండ్రికి ఫోన్ చేసి ఇక్కడెక్కడో రెండు రైళ్లు ఢకొీన్నాయి. నా కాళ్లకు దెబ్బలు తగిలాయి. వెంటనే మీరు రండి అని తన తండ్రితో పాటు ఆ గ్రామానికి సమాచారం ఇచ్చింది. ఇంతటి భీకర పరిస్థితుల్లో కాళ్లకు రక్తం కారుతున్నా బయపడకుండా ఆ పాప తన తండ్రికి దైర్యంగా సమాచారం ఇవ్వడం గొప్ప విషయమని తోటి ప్రయాణికులు చెబుతున్నారు.
పెద్దపెద్ద శబ్ధాలు..
పనిమీద విశాఖ వెళ్లి, తిరిగి ప్రయాణంలో భాగంగా రైలు ఎక్కాను. కంటాకాపల్లి దాటిన తరువాత ఒక్కసారిగా రైల్లో కరెంటు పోయింది. పెద్ద పెద్ద శబ్ధాలతో అరుపులు, కేకలు వినబడ్డాయి. ఏమైందో తెలియక కంగారు పడుతున్న లోపే నా కుడి చేయి బరువెక్కింది. మరోవైపు చేతి నుంచి రక్తం కారిపోతుంది. ఇంతలో పెద్దగా ఏడుపులు వినిపించాయి. నేను కూడా పెద్దగా కేకలు వేశాను. కొంత సమయం తర్వాత స్థానికలు వచ్చి నన్ను బలవంతంగా బయటికి తీశారు.
- నిరాకర్ మిశ్రా, మరదరాజపురం, పలాస మండలం
తండ్రి, తల్లి, కుమార్తెకు గాయాలు
విశాఖలో గాజువాకకు చెందిన జక్కలి వెంకట రమణ, భార్య బంగారుతల్లి, ఐదేళ్ల కుమార్తె కోమలి రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందు తున్నారు. తల్లి తీవ్రంగా గాయపడగా, చిన్నారి కోమలి చేయి విరిగి పోయింది. ఈనేపథ్యంలో ముగ్గురూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిని చూసిన వారి హృదయాలు చలించిపోయాయి.