Feb 07,2023 23:57

నిరసన కార్యక్రమం చేస్తున్న పల్లా శ్రీనివాసరావు

ప్రజాశక్తి -గాజువాక : గాజువాక నియోజవర్గ పరిధిలో జిఒ 301, 296, 388 ద్వారా వచ్చిన పట్టాలపై ఉన్న నిబంధనలు సరళించి, ప్లాన్‌ అప్రూవల్‌, రిజిస్ట్రేషన్లు జరిగేలా చూడాలని మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు గాజువాక తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట టిడిపి నాయకులు మంగళవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జీవీఎంసీ అధికారులు ప్లాన్‌ అనుమతి ఇవ్వకపోవడం వల్ల నిర్మాణాలు చేపట్టలేకపోతున్నారని, దీనివల్ల పేదలు సొంత స్థలం ఉన్నప్పటికీ ఇల్లు నిర్మించుకోలేని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. కొన్ని జిఒ నెంబర్లపై ఉన్న పట్టాలకు రిజిస్ట్రేషన్‌ అనుమతి లేకపోవడంతో వారి ఆర్థిక అవసరాలకు ఉపయోగపడటంలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వీటిపై దృష్టి సారించకుండా ప్రజలను ఇబ్బందికి గురిచేస్తోందన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే వీటిపై ఉన్న నిబంధనలు సరళించి ప్రజలకు ఉపయోగ పడేలా చూస్తానని చెప్పారు. అనంతరం గాజువాక తహశీల్దార్‌ కార్యాలయానికి వచ్చిన జాయింట్‌ కలెక్టర్‌ విశ్వనాథన్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్‌ గంధం శ్రీనివాసరావు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.