Apr 25,2023 17:43

మాట్లాడుతున్న నాయకులు

పట్టాలకు భూములు చూపాలి
సిపిఎం జిల్లా కార్యదర్శి టి.రమేష్‌ కుమార్‌
వ్యకాసం ఆధ్వర్యంలో బిసిలు, దళితులు రిలే నిరాహార దీక్షలు
ప్రజాశక్తి - మిడుతూరు

     మిడుతూరు మండల కేంద్రంలోని దళితులు, బిసిలకు 1996 సంవత్సరంలో ఇచ్చిన పట్టాలకు భూములు చూపాలని సిపిఎం జిల్లా కార్యదర్శి టి రమేష్‌ కుమార్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. పట్టాలకు భూములు చూపాలని కోరుతూ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మంగళవారం మిడుతూరులో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలను టి.రమేష్‌ కుమార్‌ ప్రారంభించి మాట్లాడారు. మిడుతూరులోని దళితులు, బిసిలకు 1996లో అలగనూరు పొలిమేరలో సర్వే నెంబర్‌ 26/2, 48, 376లలో పట్టా పాస్‌ పుస్తకాలు ఇచ్చారని చెప్పారు. ఈ పాసు పుస్తకాలపై సొసైటీలో పంట రుణాలు కూడా తెచ్చుకున్నారని తెలిపారు. అయితే 27 సంవత్సరాల అవుతున్నా ప్రభుత్వం, అధికారులు భూములు చూపకపోవడం విచారకరమన్నారు. పట్టా పాస్‌ పుస్తకాలు ఇచ్చిన దళితులకు భూములు చూపించాలని జిల్లా కలెక్టర్‌కు, ఎమ్మెలేయ, ఆర్‌డిఒలకు వినతి పత్రాలు సమర్పించినా స్పందన లేదన్నారు. గతంలో నిరాహార దీక్ష చేసిన సందర్భంగా తహశీల్దార్‌ 15 రోజుల్లో భూములు చూపిస్తామని హామీ ఇచ్చి ఇంతవరకు చూపకపోవడం దారుణమన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎం.నాగేశ్వరావు మాట్లాడుతూ భూములు చూపేవరకు ఆందోళన కొనసాగిస్తామని తెలిపారు. దీక్షలో లింగమ్మ, శివ, లక్ష్మమ్మ, చెన్నమ్మ, వెంకటమ్మ, రాణమ్మ తదితరులు కూర్చున్నారు. కార్యక్రమంలో సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు కె.భాస్కర్‌ రెడ్డి, బక్రీద్‌, టి.ఓబులేష్‌, లింగస్వామి, శివుడు, రామిరెడ్డి, బాలకృష్ణ, రామకృష్ణ, స్థానికులు తిరుపాలు, రాముడు, సుజ్ఞానం, జయరాముడు, ఏసన్నలు పాల్గొన్నారు.