Oct 07,2023 22:10

తహశీల్దార్‌ కార్యాలయం ముందు స్నానం చేస్తున్న పేదలు, సిపిఎం నాయకులు

      చిలమత్తూరు : 'ఇళ్లు లేని తాము ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేసుకుంటే వాటిని నిర్ధాక్షిన్యంగా తొలగించారు. ఇప్పుడు నిలువనీడ లేకుండా పోయాం. ఇళ్ల స్థలాలు ఇచ్చేంత వరకు తహశీల్దార్‌ కార్యాలయమే మా నివాసం'. అంటూ పేదలు తహశీల్దార్‌ కార్యాలయం వద్ద నిరసనాగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్ల స్థలాలు ఇవ్వాలని గత 20 రోజులుగా చిలమత్తూరులో సిపిఎం, వ్యకాసం ఆధ్వర్యంలో పేదలు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. అధికారులు పేదలు వేసుకున్న గుడిసెలను తొలగించడంతో శనివారం నాడు వారు తహశీల్దార్‌ కార్యాలయం వద్దకు చేరుకుని అక్కడే స్నానాలు చేసి నిరసన తెలిపారు. వ్యవసాయకార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఫిరంగి ప్రవీణ్‌ కుమార్‌తో పాటు పేదలు తహశీల్దార్‌ కార్యాలయం ఆవరణంలో బహిరంగంగా స్నానం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పేదలు మాట్లాడుతూ ఇళ్లు లేని తాము ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకుంటే అధికారులు కక్షగట్టి వాటిని తొలగించారన్నారు. గుడిసెలకు నిప్పుపెట్టడంతో అందులో ఉన్న వస్తువులన్నీ కాలిబూడిదయ్యాయన్నారు. తమకు నిలువనీడ లేకుండా చేసిన అధికారుల తీరును నిరసిస్తూ తహశీల్దార్‌ కార్యాలయంలోనే స్నానాలు చేసి ఇక్కడే ఉండేందుకు సిద్ధం అయ్యామన్నారు. కార్యాలయం వద్దేనే వంటావార్పు, నిద్రించి కుటుంబ సభ్యులతో కలిసి ఉంటామన్నారు. ఇళ్ల పట్టాల సమస్యల పరిష్కారంపై శనివారం నాడు జాయింట్‌ కలెక్టర్‌ను కలుస్తానని తహశీల్దార్‌ అపద్దపు మాటలు చెప్పారన్నారు. అధికారులు స్పందించే వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
రెవెన్యూ అధికారులపై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు..
పేదలు వేసుకున్న గుడిసెలను అకారణంగా తొలగించి, నిప్పుపెట్టిన రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సిపిఎం, వ్యకాసం ఆధ్వర్యంలో పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడుతూ సర్వేనెంబర్‌ 805-6, 805-7లో పేదలు వేసుకున్న గుడిసెలను ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా తొలిగించారన్నారు. గుడిసెలకు నిప్పుపెట్టడంతో విలువైన వస్తువులు, బట్టలు, పలు ధ్రువీకరణ పత్రాలు కాలిబూడిదయ్యాయన్నారు. ఒక్కో గుడిసె రూ.20వేలతో 400 కొట్టాలు వేసుకున్నారని చెప్పారు. ఈ నష్టాన్ని రెవెన్యూ అధికారులు పేదలకు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు లక్ష్మినారాయణ, రామచంద్ర, కమిటీ సభ్యులు చంద్ర, శివ, సదాశివరెడ్డి, రహంతుల్లా, మణిస్వామి, పేదలు పాల్గొన్నారు.
తహశీల్దార్‌ కార్యాలయం ముందే నిద్ర
పేదలు శనివారం రాత్రి తహశీల్దార్‌ కార్యాలయం ఆవరణ వద్దనే నిద్రించారు. తమ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. దీక్షా శిబిరం నుంచే పేదలు తహశీల్దార్‌కు ఫోన్‌ ద్వారా మాట్లాడారు. ఇందుకు స్పందించిన ఆయన సోమవారం నాడు జాయింట్‌ కలెక్టర్‌ను కలిసి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని చెప్పారు. సోమవారం నాడు ఇళ్ల పట్టాల సమస్య పరిష్కారం కాకుంటే ఆందోళనను మరింత తీవ్రతరం చేస్తామని పేదలు ఆయనకు తెలియజేశారు.